Joint Pains | ఒకప్పుడు వయస్సు మీద పడిన వారికి మాత్రమే కీళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా ఈ సమస్య వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు అధికంగా పేరుకుపోవడం, మద్యం విపరీతంగా సేవించడం, మాంసాహారం అధికంగా తినడం, ఉప్పును అధికంగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్‌ను అధికంగా తినడం, థైరాయిడ్ వంటి అనేక కారణాల వల్ల చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యను పట్టించుకోకపోతే అది ఆర్థరైటిస్‌కు దారి తీస్తుంది. వృద్ధాప్యంలో ఎముకలు పెళుసుగా మారి ఆస్టియోపోరోసిస్ కూడా వస్తుంది. కనుక కీళ్ల నొప్పులు ఉన్నవారు వాటిని అశ్రద్ధ చేయకూడదు. కీళ్ల నొప్పులు సాధారణమైనవి అయితే కొన్ని జాగ్రత్తలను, చిట్కాలను పాటిస్తే చాలు, సులభంగా వీటి నుంచి బయట పడవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులు ఉన్నవారు హీట్ థెరపీ లేదా కోల్డ్ థెరపీని పాటించవచ్చు. ఒక శుభ్రమైన వస్త్రాన్ని వేడి నీటిలో ముంచి దాన్ని పిండి దాంతో నొప్పులపై కాపడం పెట్టవచ్చు. లేదా శుభ్రమైన వస్త్రంలో కొన్ని ఐస్ ముక్కలు వేసి దాంతోనూ మర్దనా చేయవచ్చు. ఇలా ఏవిధంగా అయినా సరే కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా భాగాల్లో ఉండే కండరాలు ప్రశాంతంగా మారుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఆహారాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే తద్వారా కూడా కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇందుకు గాను పసుపు ఎంతో బాగా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనంగా పనిచేస్తుంది. ఇది నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. పసుపును నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. లేదా పసుపును గోరు వెచ్చని పాలలో కలిపి రాత్రి పూట తీసుకోవచ్చు. దీంతో కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లంలోనూ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇది సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా భోజనానికి ముందు 1 టీస్పూన్ అల్లం రసాన్ని సేవిస్తుండాలి. లేదా అల్లంను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లలో కాస్త తేనె కలిపి రోజుకు 2 కప్పుల చొప్పున ఉదయం, సాయంత్రం తాగుతున్నా కూడా ఫలితం ఉంటుంది. డాక్టర్ల సూచన మేరకు అల్లం సప్లిమెంట్లను కూడా వాడవచ్చు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలను రోజూ తింటున్నా కూడా కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపలను వారంలో కనీసం 2 సార్లు తినాలి. అదే వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు అయితే రోజూ గుప్పెడు చాలు. వీటిని నీటిలో నానబెట్టి తింటే మంచిది.
బెర్రీలు, ఆకుకూరలు, క్యాప్సికం వంటి వాటిల్లోనూ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగానే ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఆలివ్ ఆయిల్లో ఓలియొకాంథల్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. కనుక మీరు వంటల్లో సాధారణ నూనెకు బదులుగా ఆలివ్ ఆయిల్‌ను వాడితే మంచిది. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు భారీ వ్యాయామాలను చేయలేరు. కనుక వారు కనీసం వాకింగ్ అయినా చేయాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే సైకిల్ తొక్కడం, స్విమ్మింగ్ వంటివి కూడా చేయవచ్చు. కండరాలు కొన్ని చోట్ల దృఢంగా మారడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని తగ్గించుకోవాలంటే యోగా లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. ఇలా పలు చిట్కాలను పాటిస్తుంటే కీళ్ల నొప్పులను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.