Stomach Upset | వర్షాకాలంలో సహజంగానే మనకు జీర్ణ సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఇందుకు అనేకే కారణాలు ఉంటాయి. ఎక్కువగా కలుషిత ఆహారం తినడం లేదా నీళ్లను తాగడం వల్ల మనకు పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. కొందరికి విరేచనాలు ఎడతెరిపి లేకుండా అవుతూనే ఉంటాయి. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన వంట ఇంట్లో ఉండే పదార్థాలతోనే అత్యంత సహజసిద్ధంగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ పదార్థాలను ఉపయోగిస్తే పొట్టలో ఏర్పడే అసౌకర్యం తొలగిపోవడమే కాదు విరేచనాలు కూడా ఆగిపోతాయి. అలాగే ఇతర జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణాశయ గోడలను ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. దీంతో పొట్టలో ఏర్పడే అసౌకర్యం తగ్గిపోతుంది. అలాగే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అల్లాన్ని తీసుకుంటే జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. చిన్న అల్లం ముక్కను 2 కప్పుల నీటిలో వేసి ఒక కప్పు నీరు అయ్యే వరకు మరిగించాలి. అనంతరం ఆ నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే అందులో కాస్త తేనె కలిపి తాగేయాలి. ఇలా రోజుకు 2 సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నేరుగా అలాగే నమిలి తినవచ్చు. భోజనానికి ముందు 1 టీస్పూన్ అల్లం రసం సేవిస్తున్నా కూడా ఫలితం ఉంటుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది.
పుదీనా ఆకుల్లో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణాశయ గోడలను ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. దీంతో పొట్టలో ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ బయటకు వెళ్లిపోతుంది. వికారం తగ్గుతుంది. కొన్ని పుదీనా ఆకులను నోట్లో వేసుకుని నమిలి మింగవచ్చు. లేదా పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. ఇలా రోజుకు 2 నుంచి 3 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అలాగే జీలకర్ర కూడా ఈ సమస్యలకు అద్భుతంగానే పనిచేస్తుంది. ఇందులో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల జీలకర్రను తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ తగ్గిపోతాయి. జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను ఒక కప్పు మోతాదులో రోజుకు 2 సార్లు తాగుతుండాలి. లేదా ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి వేసి కలిపి తాగుతున్నా కూడా ప్రయోజనం ఉంటుంది.
బేకింగ్ సోడా సహజసిద్ధమైన అంటాసిడ్ మాదిరిగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో అజీర్తి, గ్యాస్, గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టలో ఏర్పడే అసౌకర్యం తొలగిపోతుంది. అలాగే నిమ్మరసం యాసిడ్ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇది పొట్టలోకి చేరితే భిన్నంగా పనిచేస్తుంది. అందువల్ల ఈ రెండింటి మిశ్రమం పొట్టలో ఏర్పడే అసౌకర్యాన్ని తొలగిస్తుంది. ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా, సగం నిమ్మ చెక్క రసాన్ని పిండి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి సేవించాలి. ఇలా చేస్తుంటే పొట్టలో ఏర్పడే అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా అజీర్తి తగ్గిపోతుంది. దీని వల్ల విరేచనాల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఇలా పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.