Sinusitis | వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా చల్లని ఆహారాలను తీసుకున్నప్పుడు సైనస్ సమస్య ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. సైనస్ ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది. దీని వల్ల తీవ్రమైన అవస్థలను ఎదుర్కొంటారు. సైనస్ సమస్య ఉన్నవారు సహజంగానే వైద్యులు ఇచ్చే మందులను వాడుతారు. యాంటీ బయాటిక్స్‌తోపాటు నొప్పిని, కఫాన్ని తగ్గించే మందులను వాడుతారు. సైనస్ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. డస్ట్ అలర్జీ, రసాయనాలు లేదా ఇతర పదార్థాల వల్ల సైనస్ వస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా చల్లని ద్రవాలను తాగినప్పుడు కూడా సైనస్‌ను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో నాసికా మార్గాలు, శ్వాస నాళాలు వాపులకు గురవుతాయి. దీంతో ఇన్ఫెక్షన్ వస్తుంది. గొంతులో, తలలో నొప్పి, ముఖం నొప్పి, ముక్కు, చెవులు, దంతాల్లో నొప్పిగా ఉండడం, జ్వరం, ముఖం వాపులకు గురవడం, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే సైనస్ ఉన్నవారు డాక్టర్ల ఇచ్చే మందులను వాడడంతోపాటు పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది.
సైనస్ ఉన్నవారు చల్లని ద్రవాలను తాగకూడదు. చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు ముక్కు, చెవులు, తల భాగాలను కవర్ చేసేలా క్యాప్‌లను ధరించాలి. వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకూడదు. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలను తింటుంటే ఉపశమనం లభిస్తుంది. విటమిన్ ఎ ఎక్కువగా క్యారెట్లు, యాపిల్స్, టమాటా, బ్రోకలీ, పాలు, నారింజ, అవకాడో, పనీర్ వంటి ఆహారాల్లో లభిస్తుంది. వీటిని తినడం వల్ల సైనస్ ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అలాగే సైనస్ ఉన్నవారు ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉండేలా చూసుకోవాలి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. తలనొప్పి, సైనస్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇక సైనస్ సమస్య ఉన్నవారు పుదీనా ఆకుల నీళ్లను ఆవిరి పడుతుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఒక పాత్రలో బాగా మరుగుతున్న నీటిని తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులను వేయాలి. అనంతరం దాని నుంచి వచ్చే ఆవిరిని బాగా పీల్చాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది.
సైనస్ ఉన్నవారు వేడి వేడి సూప్‌లను తరచూ తాగుతుండాలి. నాన్ వెజ్ తినేవారు అయితే చికెన్ సూప్ తాగాలి. వెజిటేరియన్లు వెజిటబుల్ సూప్‌ను తాగాలి. దీని వల్ల కఫం కరిగిపోతుంది. ముక్కు దిబ్బడ, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస సరిగ్గా పీల్చుకుంటారు. ఇక సైనస్ ఉన్నవారు జలనేతి అనే ప్రక్రియను అనుసరించాలి. దీని వల్ల సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. జలనేతి అనేది ఒక యోగా ప్రక్రియ. ఇందులో భాగంగా అర లీటరు నీటికి ఒక టీస్పూను సైంధవ లవణం గానీ అయోడిన్ లేని సముద్రపు ఉప్పును గానీ బాగా కలిపి బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత జలనేతి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పరికరం (జల నేతి పోట్) ను ఉపయోగించి ముక్కులోని ఒక రంధ్రం ద్వారా నీటిని పంపితే ముక్కు మరొక రంధ్రం ద్వారా ఆనీరు బయటకు వచ్చేస్తుంది. దీంతో ముక్కులో ఉండే మలినాలన్నీ బయటకు వస్తాయి. శ్వాస ఇబ్బందులు తొలగిపోతాయి. సైనస్ నుంచి ఉపశమనం పొందుతారు. ముక్కు రెండు రంధ్రాలనూ ఇదే ప్రక్రియలో శుభ్రపరుచుకోవాలి. సాధారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినపుడు, ముక్కు దిబ్బడ లేదా ఆస్తమాతో బాధ పడుతున్నప్పుడు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఉపశమనం కోసం ఈ యోగా ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను సాధన చేయడానికి ముందు గురువు వద్ద సలహాలు, సూచనలను తీసుకోవాలి.
ఇక సైనస్ సమస్యను తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఎంతగానో పనిచేస్తుంది. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సైనస్ నొప్పులను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తాగాలి. ఇలా రోజుకు ఒకసారి తాగుతుండాలి. దీని వల్ల సైనస్ నుంచి బయట పడవచ్చు. అల్లంతో తయారు చేసిన కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. లేదా ఒక టీస్పూన్ అల్లం రసం, ఒక టీస్పూన్ తేనెను కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఇది సైనస్ నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. అలాగే కారం, మసాలాలు ఉన్న ఆహారాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. వారంలో కనీసం 2 సార్లు ఇలాంటి ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల కఫం అంతా కరిగిపోతుంది. సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది.