Cough | సీజన్లు మారినప్పుడు సాధారణంగా చాలా మందికి దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. కొందరికి జలుబు ఉండకపోయినా విపరీతంగా దగ్గు వస్తుంది. ఇక జలుబు వచ్చిన వారికి అయితే అది తగ్గే క్రమంలో దగ్గు వస్తుంది. ఎలాగైనా సరే కచ్చితంగా దగ్గుతో ఇబ్బంది పడతారు. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్లను, కాఫ్ సిరప్‌లను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధంగానే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. పలు పదార్థాలతో కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు జలుబు, ముక్కు దిబ్బడ వంటి ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. ఆయా పదార్థాల్లో యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి కనుక రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక దగ్గు తగ్గేందుకు పాటించాల్సిన ఇంటి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దగ్గు తగ్గేందుకు తేనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇతర గొంతు సమస్యలను సైతం ఇది తగ్గిస్తుంది. గొంతులో మంట, గరగర, నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా పూటకు ఒకసారి చొప్పున రోజుకు 3 సార్లు తాగుతుండాలి. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఏడాది వయస్సు లోపల ఉన్న చిన్నారులకు మాత్రం తేనె ఇవ్వకూడదు. దగ్గు ఉన్నవారు వేడి ద్రవాలను తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. దగ్గు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే అల్లం, పెప్పర్మింట్, కమోమిల్ వంటి హెర్బల్ టీలను తాగుతున్నా కూడా దగ్గు నుంచి బయట పడవచ్చు.
దగ్గు నుంచి బయట పడేలా చేసేందుకు తేనె, నిమ్మరసం, గోరు వెచ్చని నీటి మిశ్రమం కూడా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగుతుండాలి. రోజుకు 2 సార్లు ఇలా తాగితే దగ్గు తగ్గిపోతుంది. అలాగే అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల పూటకో అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమిలి తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. లేదా అల్లంను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను సైతం తాగవచ్చు. అవసరం అనుకుంటే ఆ నీటిలో కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు. ఇక మనం రోజూ వంటల్లో వాడే పసుపు కూడా దగ్గు నుంచి ఉపశమనం అందేలా చేస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. అందువల్ల దగ్గు తగ్గేలా చేస్తుంది. గోరు వెచ్చని పాలలో పసుపు కలిపి తాగుతుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
దగ్గు సమస్య ఉన్నవారు ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకుంటే త్వరగా ఉపశమనం పొందవచ్చు. అందుకు గాను వేడి సూప్‌లు లేదా ద్రవాలను తాగాల్సి ఉంటుంది. చికెన్ సూప్ లేదా వెజిటెబుల్ సూప్ ఇందుకు చక్కగా పనిచేస్తాయి. అలాగే అల్లం, వెల్లుల్లి వంటి వాటిని తీసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు తగ్గేలా చేస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, నిమ్మ, పైనాపిల్, కివి, బొప్పాయి, దానిమ్మ, స్ట్రాబెర్రీలు వంటి పండ్లను తింటున్నా ఫలితం ఉంటుంది. అరటి పండ్లు కూడా దగ్గు నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. ప్రొ బయోటిక్ ఆహారాలు కూడా ఈ సమస్య ఉన్నవారికి మేలు చేస్తాయి. ముఖ్యంగా పెరుగును తింటుంటే ఉపయోగం ఉంటుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తీసుకుంటుంటే దగ్గు నుంచి త్వరగా బయట పడవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.