Arthritis Pains | వయస్సు మీద పడిన వారికి సహజంగానే ఎముకల్లో పటుత్వం కోల్పోతారు. శరీరంలో క్యాల్షియం, విటమిన్ డి తగినంత స్థాయిలో ఉండవు. దీంతో ఎముకలు గుల్లబారిపోవడం, బలహీనంగా మారడం జరుగుతాయి. అయితే ప్రస్తుతం చాలా మందికి యుక్త వయస్సులోనే ఎముకల సంబంధిత సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో ఆర్థరైటిస్ కూడా ఒకటి. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. ప్రమాదాల బారిన పడినప్పుడు గాయాలు అవడం, అధికంగా బరువు ఉండడం, వంశ పారంపర్యత, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తినడం, శీతల పానీయాలు ఎక్కువగా సేవించడం, పోషకాహార లోపం వంటి పలు కారణాల వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. దీంతో కీళ్లలో తీవ్రమైన నొప్పులు ఉంటాయి. అయితే ఆర్థరైటిస్ సమస్యకు డాక్టర్లు ఇచ్చే మందులను వాడడంతోపాటు పలు ఇంటి చిట్కాలను కూడా పాటించవచ్చు. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపులు సైతం తగ్గిపోతాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు తరచూ ఆయా భాగాలపై వేడి లేదా చల్లని ప్యాక్‌లను కాపడంలా పెడుతుండాలి. కనీసం 15 నుంచి 20 నిమిషాలు హీట్ లేదా ఐస్ ప్యాక్‌ను పెట్టకుంటూ ఉండాలి. దీంతో ఆయా భాగాల్లో రక్త సరఫరా మెరుగు పడుతుంది. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపు తగ్గిపోతుంది. ఆర్థరైటిస్ ఉన్నవారు వ్యాయామం చేయాలంటే కష్టంగా ఉంటుంది. కానీ వీలైనంత వరకు కాళ్లు, చేతులను కదిలిస్తూ తేలికపాటి వ్యాయామాలు చేయాలి. వాకింగ్, స్విమ్మింగ్, సైకిల్ తొక్కడం, ఏరోబిక్ వ్యాయామాలు చేయవచ్చు. దీని వల్ల కండరాలు, కీళ్లలో కదలికలు సరిగ్గా ఉంటాయి. తరచూ చేస్తుంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల కదలిక సరిగ్గా ఉంటుంది. సమస్య మరింత తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు.
ఆర్థరైటిస్ ఉన్నవారు అధికంగా బరువు ఉన్నట్లయితే ముందు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. కొందరికి అధిక బరువు కారణంగా కూడా ఆర్థరైటిస్ నొప్పులు వస్తాయి. కనుక ముందు బరువు తగ్గించుకోవాలి. ఇలా చేస్తే చాలా వరకు ఆర్థరైటిస్ నుంచి బయట పడవచ్చు. ఆర్థరైటిస్ ఉన్నవారు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఆహారాలను తరచూ తింటుండాలి. ఇవి నొప్పులను సహజసిద్ధంగా తగ్గించేందుకు పనిచేస్తాయి. ముఖ్యంగా సముద్రపు ఆహారం, చేపలు, రొయ్యలు వంటివి తినాలి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆర్థరైటిస్ నొప్పులకు ఔషధంలా పనిచేస్తాయి. అలాగే అవిసె గింజలు, చియా సీడ్స్, వాల్ నట్స్‌ను కూడా రోజూ తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఇవన్నీ నొప్పులను, వాపులను తగ్గిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, బ్రోకలీ, ఆకుపచ్చ క్యాప్సికం తింటుండాలి. ఇవి నొప్పులను తగ్గిస్తాయి. వాపులు రాకుండా చూస్తాయి. ఓట్స్, బ్రౌన్ రైస్, కినోవా వంటి ఆహారాలను కూడా తినాలి. రాత్రి పూట పాలలో పసుపు కలిపి తాగుతున్నా కూడా ప్రయోజనం ఉంటుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. అలాగే రోజూ భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసాన్ని ఉదయం పరగడుపునే సేవించాలి. అల్లంలో ఉండే సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్ లక్షణాలు నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. రోజూ ఉదయం పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటున్నా కూడా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అదేవిధంగా శల్లకి, అశ్వగంధ వంటి మూలికలను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. గ్రీన్ టీ కూడా ఆర్థరైటిస్ కు అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.