Stress | ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా నిత్యం చాలా మంది అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలతోనూ చాలా మంది సతమతం అవుతున్నారు. దీంతో చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీంతో కొందరు క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలా ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు సైతం చెబుతున్నాయి. అయితే అధిక శాతం ఆత్మహత్యలకు ఒత్తిడే ప్రధాన కారణమని మానసిక వైద్యులు కూడా చెబుతున్నారు. కనుక ఒత్తిడి లేదా ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు గాను పలు ఆరోగ్య చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించే ఆ ఆరోగ్య చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం ఎంతో గొప్పగా పనిచేస్తుంది. చాలా మంది దీనిపై దృష్టి సారించరు. కానీ ఒత్తిడికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేస్తే చాలు, అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. నిర్మానుష్య ప్రదేశంలో లేదా పచ్చని ప్రకృతిలో రోజూ కాసేపు ధ్యానం చేయాలి. చుట్టూ ఉన్న పరిసరాలను కాసేపు మరిచిపోవాలి. ధ్యాసనంతా శ్వాసపైనే పెట్టాలి. ఇలా రోజూ ధ్యానం చేస్తుంటే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని, మనస్సు రిలాక్స్ అవుతుందని, ఎలాంటి ఆందోళనలు దరిచేరవని అంటన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ధ్యానంతోపాటు వ్యాయామం కూడా మనల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మూడ్ మారుతుంది. బరువైన వ్యాయామాలు చేయాల్సిన పనిలేదు. 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేసినా చాలు ప్రయోజనం పొందవచ్చని, దీంతో మూడ్ మారి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని అంటున్నారు. అలాగే ఒత్తిడి నుంచి దూరమవ్వాలంటే మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. తాజా పండ్లు, కూరగాయలతోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా వాల్ నట్స్, పొద్దు తిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు, చేపలు వంటి ఆహారాలను తింటున్నట్లయితే హ్యాప్పీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మూడ్ను మారుస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి కారణంగా నిద్ర సరిగ్గా పోవడం లేదు. కానీ ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడాలంటే నిద్ర కూడా ఎంతగానో సహాయం చేస్తుంది. రోజుకు కనీసం 7 గంటలపాటు అయినా నిద్రించాలి. నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కచ్చితంగా 7 గంటలపాటు నిద్రించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడూ ఇంట్లోనే ఉండకుండా బయట అలా తిరిగి రావాలి. నలుగురిలోనూ కలవాలి. స్నేహితులు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లాలి. వారితో ముచ్చటించాలి. దీంతో ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. కనుక ఈ చిట్కాలను పాటిస్తే ఒత్తిడి, ఆందోళన నుంచి సులభంగా బయట పడవచ్చని వారు అంటున్నారు.