Eyes Health | మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. కానీ నేటి డిజిటల్ యుగంలో చాలా మంది కంటి చూపు సమస్య బారిన పడుతున్నారు. చిన్న వయస్సులో ఉన్నవారు కూడా కళ్లద్దాలను వాడుతున్నారు. పోషకాహార లోపం వల్లే ఈ సమస్య వస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కనుక కంటి చూపును మెరుగు పరిచే పోషకాహారాలను తినాల్సి ఉంటుంది. వాటిల్లో బ్రొకలి మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. అలాగే కాలిఫ్లవర్, జామ పండ్లు, ఉసిరికాయలు, క్యారెట్లు వంటి ఆహారాల్లోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ ఆహారాల్లో విటమిన్లు ఎ, సి, కెరోటిన్, లుటీన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి.
డిజిటల్ తెరలను చూడడంతోపాటు రోజంతా బయట ఎండలో తిరిగే వారి కళ్లు త్వరగా పొడిబారి పోతుంటాయి. దీంతో కళ్లు ఎరుపెక్కి దురదలు వస్తాయి. కళ్లు మంటలుగా కూడా ఉంటాయి. అలాంటి వారు కళ్లతో వస్తువులను సరిగ్గా చూసేందుకు కూడా కొన్ని సార్లు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్యలు ఉన్నవారు నీళ్లను అధికంగా తాగాలి. రోజుకు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీళ్లను తాగితే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. దీంతో కళ్లు పొడిబారకుండా చూసుకోవచ్చు. ఇక చాలా మంది నిత్యం ఏసీల్లో గడుపుతుంటారు. ఆఫీసుల్లో పనిచేస్తుంటారు కనుక ఏసీల్లో ఉంటారు. దీంతో అక్కడి వాతావరణం పొడిగా మారుతుంది. దీని వల్ల కూడా కళ్లు పొడిబారుతాయి. కనుక ఏసీల్లో ఎక్కువగా గడిపే వారు ఆ సమయాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. లేదంటే దీర్ఘకాలికంగా కంటి చూపు విషయంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
అయితే ఏసీల్లో కచ్చితంగా ఉండాల్సిందే అనుకునే వారు రూమ్‌లో హ్యుమిడిఫైర్‌ను పెట్టుకోవాలి. ఇది వాతావరణంలో తేమను అలాగే ఉంచుతుంది. దీంతో కళ్లపై ప్రభావం పడదు. కళ్లు పొడిబారకుండా ఉంటాయి. ఇక కొందరు కళ్లు దురదగా ఉంటే తరచూ నలుపుతుంటారు. దీని వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు తమకు సమీపంలో ఉన్న కళ్ల డాక్టర్‌ను సంప్రదించాలి. దీంతో వారు కళ్ల డ్రాప్స్ ఇస్తారు. వాటిని వాడితే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకానీ కళ్లను నలపకూడదు. అలాగే దుమ్ము, ధూళి వాతావరణంలో ఉండే వారు, ద్విచక్ర వాహనాలపై ఎక్కువగా తిరిగే వారు కచ్చితంగా కళ్లకు రక్షణగా గ్లాసెస్‌ను ధరించాలి. వాహనాలపై వెళితే హెల్మెట్ ధరించాలి. దీని వల్ల కళ్లు కూడా సురక్షితంగా ఉంటాయి.
మీరు రోజూ కంప్యూటర్లు, ఫోన్లను ఎక్కువగా వాడేవారు అయితే వాటి వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. ఇలా చేస్తే కళ్లపై పడే అధిక భారం, ఒత్తిడి తగ్గుతాయి. కళ్లు రిలాక్స్ అవుతాయి. అలాగే కంప్యూటర్లపై ఎక్కువగా పనిచేసేవారు అదే పనిగా తెరను చూడకూడదు. 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును చూడాలి. ఇలా 20-20-20 రూల్‌ను పాటించాలి. దీంతో కళ్లు సురక్షితంగా ఉంటాయి. కంటి చూపు సమస్యలు రావు. ఇలా పలు సూచనలను పాటించడం వల్ల మీ కళ్లు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కంటి చూపు సమస్యలు తలెత్తవు.