Cough Home Remedies | సీజన్లు మారినప్పుడు ఎవరికైనా సరే సహజంగానే దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. కొందరికి దగ్గు రాకపోయినా ముందుగా జలుబు లేదా జ్వరం వస్తాయి. ఇవి తగ్గే క్రమంలో దగ్గు వస్తుంది. దీంతో చాలా ఇబ్బందులు పడతారు. ఇక చుట్టు పక్కల ఎవరికైనా దగ్గు వస్తే ఆ దగ్గు మనకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇక దగ్గు వచ్చిన వారు వెంటనే మెడికల్ షాపుకు వెళ్లి టానిక్ లేదా ట్యాబ్లెట్లను కొని తీసుకుంటారు. కానీ ఇలా ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు మందులను వాడడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో మందులు మన ఆరోగ్యానికి హాని చేస్తాయని వారు అంటున్నారు. అయితే దగ్గు నుంచి బయట పడేందుకు పలు ఇంటి చిట్కాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. ఈ చిట్కాలను పాటిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటంటే..
దగ్గు సమస్యను తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. తేనెను సేవించడం వల్ల గొంతుకు రిలీఫ్ లభిస్తుంది. ఒక టీస్పూన్ తేనెను ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. లేదా ఏదైనా హెర్బల్ టీలో అయినా తేనె కలిపి తాగవచ్చు. ఇలా మూడు పూటలా తేనెను తీసుకుంటుంటే దగ్గు నుంచి త్వరగా రిలీఫ్ లభిస్తుంది. గొంతులో గరగర, మంట, నొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి. తేనెలో ఉండే సహజసిద్ధమైన యాంటీ మైక్రోబియల్ గుణాలు దగ్గును తగ్గిస్తాయి. దగ్గును తగ్గించడంలో అల్లం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శ్వాసనాళాల కండరాలను వదులు చేస్తాయి. దీంతో గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి. అల్లం రసాన్ని నేరుగా ఒక టీస్పూన్ మోతాదులో ప్రతి పూట తాగవచ్చు. లేదా అల్లాన్ని నీటిలో మరిగించి ఆ నీళ్లను కూడా తాగవచ్చు. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
పసుపులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి దగ్గు తగ్గేందుకు ఎంతగానో దోహదపడతాయి. రాత్రిపూట నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కాస్త పసుపు కలిపి తాగుతుండాలి. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. దగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే ఉదయం, సాయంత్రం రెండు పూటలా పసుపును నీటిలో వేసి మరిగించి తాగుతున్నా కూడా సమస్య నుంచి బయట పడవచ్చు. నీళ్లను బాగా మరిగించి ఆవిరి వస్తున్నప్పుడు అందులో కాస్త పెప్పర్ మింట్ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆయిల్ ను కొన్ని చుక్కలు వేసి అనంతరం వచ్చే ఆవిరిని బాగా పీల్చాలి. ఇలా 10 నిమిషాల పాటు చేయాలి. రోజుకు 3 పూటలా ఇలా చేస్తున్నా కూడా దగ్గు, జలుబు తగ్గుతాయి.
దగ్గును తగ్గించడంలో లవంగాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాల్లో అనాల్జెసిక్ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. 2 లవంగాలను తీసుకుని పొడి చేసి ఆ మిశ్రమాన్ని ఒక టీస్పూన్ తేనెతో కలిపి సేవించాలి. ఇలా రోజుకు 3 పూటలా సేవిస్తుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ రసాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో కాస్త తేనె కలిపి రోజుకు3 పూటలా సేవిస్తుండాలి. ఉల్లిపాయల్లో ఉండే సహజసిద్ధమైన యాంటీ మైక్రోబియల్ గుణాలు దగ్గును తగ్గిస్తాయి. గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇలా పలు రకాల సహజసిద్ధమైన ఇంటి చిట్కాలను పాటించడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.