Acne | మొటిమలు అనేవి సాధారణంగా యుక్త వయస్సు నుంచి ఆపైన ఎవరికైనా సరే వస్తుంటాయి. ఒక్కసారి మొటిమలు వచ్చాయంటే అంత సులభంగా తగ్గవు. కొందరికి ముఖంపై విపరీతంగా మొటిమలు వస్తాయి. కొందరికి ఒకటి లేదా రెండు మొటిమలు వస్తాయి. మొటిమలు వచ్చేందుకు ప్రధానంగా బ్యాక్టీరియా కారణం అవుతుంది. మన చర్మంలో ఉండే తైల గ్రంథులు నూనె లాంటి పదార్థాన్ని స్రవించినప్పుడు అక్కడ ఉండే పి.అక్ని అనే బ్యాక్టీరియా ఆ నూనెను అడ్డుకుంటుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న దుమ్ము, మురికి, మృత చర్మ కణాలు అన్నీ కలసి నూనెతోపాటు మిశ్రమంగా మారి మొటిమలుగా ఏర్పడుతాయి. మొటిమలు వచ్చాయంటే ఖరీదైన చికిత్సలు చేయించుకోవాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలను వాడితే సహజసిద్ధంగానే మొటిమలను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలను తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమలకు కారణం అయ్యే పి.అక్ని అనే బ్యాక్టీరియాను టీ ట్రీ ఆయిల్ నిర్మూలిస్తుంది. దీంతో మొటిమలు తగ్గిపోతాయి. ఈ నూనెలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి వాపు, ఎరుపు దనాన్ని తగ్గిస్తాయి. టీ ట్రీ ఆయిల్‌ను కొన్ని చుక్కలు తీసుకుని నేరుగా మొటిమలపై రాత్రి పూట రాయాలి. ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే మొటిమలు తగ్గిపోతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఈ సమస్య నుంచి బయట పడేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీంతో మొటిమలు తగ్గిపోతాయి. కాస్త నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి కాటన్ బాల్ సహాయంతో మొటిమలపై రాయాలి. 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా సమస్య తగ్గిపోతుంది.
కలబంద గుజ్జులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని నేరుగా మొటిమలపై రాయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. దీంతో మొటిమలను తగ్గించుకోవచ్చు. కలబంద గుజ్జు ముఖానికి కాంతిని తేవడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జును రాస్తుంటే ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ముడతలు, మచ్చలు పోయి యవ్వనంగా కనిపిస్తారు. తేనె కూడా మొటిమలను తగ్గించడంలో బాగానే పనిచేస్తుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. తేనెను రాత్రి పూట ముఖానికి రాసి మరుసటి రోజు ఉదయం కడిగేయవచ్చు. లేదా తేనెను రాసిన తరువాత గంట సేపు ఆగి కడిగేయాలి. ఇలా చేస్తే రోజుకు 2 సార్లు ఈ చిట్కాను పాటించాలి. దీంతో మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి.
జింక్ లోపం ఉన్నవారిలోనూ మొటిమలు తరచూ వస్తుంటాయి. ఒక వేళ మీకు గనక జింక్ లోపం ఉంటే జింక్ ఉండే ఆహారాలను తినాలి. జింక్ మనకు ఎక్కువగా సముద్రపు ఆహారం, మటన్, చికెన్, కోడిగుడ్లు, పప్పు దినుసులు, నట్స్, విత్తనాలు, పాలు, పాల ఉత్పత్తులు, తెల్లగా ఉండే ఆహారాల్లో లభిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా కూడా మొటిమల నుంచి బయట పడవచ్చు. అలాగే గ్రీన్ టీని రోజుకు 2 కప్పులు సేవిస్తున్నా కూడా సకల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. గ్రీన్ టీని సేవించడం వల్ల చర్మం కాంతివంతంగా మారి సహజసిద్ధమైన నిగారింపును పొందుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా పలు రకాల చిట్కాలను పాటిస్తూ ఆహారం తీసుకుంటుంటే మొటిమలను సహజసిద్ధంగానే తగ్గించుకోవచ్చు. పైగా ముఖం కూడా అందంగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది.