Piles | ప్రస్తుత తరుణంలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. టాయిలెట్లో చాలా మంది ఫోన్ వాడుతూ సమయం గడుపుతారు. అయితే ఇది పైల్స్‌కు కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పైల్స్ వచ్చేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. మలబద్దకం సమస్య దీర్ఘకాలంగా ఉండడం, మాంసాహారాలను అధికంగా తినడం, బరువు ఎక్కువగా ఉండడం, ఫైబర్ లేని ఆహారాలను రోజూ తినడం, థైరాయిడ్, డయాబెటిస్ ఉండడం, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్‌ను అధికంగా తినడం వంటివి పైల్స్‌కు కారణం అవుతుంటాయి. అయితే ఇది సాధారణ సమస్యే. ప్రారంభంలో ఉంటే కొన్ని చిట్కాలను పాటిస్తే దీని నుంచి ఇట్టే సులభంగా బయట పడవచ్చు. పైల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాత్ టబ్ లాంటిది ఉంటే అందులో గోరు వెచ్చని నీళ్లు పోసి కాసేపు అందులో కూర్చోవాలి. తరచూ ఇలా చేస్తుంటే సమస్య తగ్గుతుంది. లేదా వేడి నీటిలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి దాంతో పైల్స్ ఉన్న చోట కాపడం కూడా పెట్టుకోవచ్చు. దీంతో నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపు తగ్గిపోతుంది. కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్‌ను సంబంధిత భాగంపై మర్దనా చేస్తున్నట్లు పెడుతున్నా ఈ సమస్య తగ్గిపోతుంది. ఇలా కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ప్యాక్‌ను సంబంధిత భాగంపై ఉంచాలి. దీంతో వాపు, నొప్పి తగ్గిపోతాయి. పైల్స్‌ను తగ్గించడంలో కలబంద గుజ్జు కూడా బాగానే పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. నొప్పి ఉన్న చోట దీన్ని రాస్తుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. పైల్స్ తగ్గిపోతాయి.
కొబ్బరినూనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఇందులోనూ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గిస్తాయి. రాత్రి పూట నిద్రకు ముందు నొప్పి ఉన్న చోట కాస్త కొబ్బరినూనెను వేడి చేసి మర్దనా చేస్తుండాలి. దీంతో సమస్య తగ్గిపోతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. యాపిల్ (పొట్టుతో సహా), పియర్స్, బెర్రీలు, అరటి పండ్లు, నారింజ పండ్లు వంటి పండ్లను రోజూ తింటుంటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే ఆకుకూరలు, కూరగాయలు, ముఖ్యంగా కాలిఫ్లవర్, క్యారెట్లు, చిలగడ దుంపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లోనూ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పైల్స్‌ను తగ్గేలా చేస్తుంది. ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్, కినోవా వంటి ధాన్యాలను తింటున్నా కూడా ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
పప్పు దినుసులు, శనగలు, బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే పైల్స్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. రోజూ నీళ్లను సరైన మోతాదులో తాగకపోయినా కూడా పైల్స్ వస్తాయి. కనుక నీళ్లను అధికంగా తాగాలి. కనీసం 8 గ్లాసులకు పైగా నీళ్లను తాగుతుంటే ఫలితం ఉంటుంది. కొందరు మల విసర్జన చేసేటప్పుడు బలవంతంగా చేస్తారు. ఇలా చేయకూడదు. మలం వస్తేనే విసర్జించాలి. బలవంతంగా చేస్తే పైల్స్‌కు కారణమవుతుంది. టాయిలెట్లో ఎక్కువ సేపు కూర్చోకూడదు. దీని వల్ల కూడా పైల్స్ వస్తాయి. రోజూ శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వ్యాయామం చేయాలి. పైల్స్ సాధారణ సమస్యే అయినప్పటికీ ఈ జాగ్రత్తలను పాటిస్తే వాటిని తగ్గించుకోవచ్చు. కానీ నిర్లక్ష్యం చేస్తే శస్త్ర చికిత్సకు దారి తీస్తుంది. కనుక ముందుగానే జాగ్రత్త పడితే అక్కడి వరకు పరిస్థితి వెళ్లకుండా చూసుకోవచ్చు.