Mosquitoes | వర్షాకాలం వచ్చేసింది. సీజనల్ వ్యాధులు ఇప్పటికే చాలా మందికి వస్తున్నాయి. ఈ సీజన్ లో దోమలు కూడా దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి వాతావరణం ఉంటే దోమలు వృద్ధి చెందడం చాలా సులభతరం అవుతుంది. దీంతో దోమలు పుట్టలు పుట్టలుగా తయారై మన ఇండ్లలోకి వచ్చి మనపై దాడి చేస్తాయి. రాత్రి, పగలు తేడా లేకుండా మన రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంటాయి. దీంతో మనకు అనేక విష జ్వరాలు, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అయితే కొన్ని రకాల సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే దోమల బెడద ఉండదు. దోమలను తరిమి కొట్టవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దోమలను తరమాలంటే ముందుగా దోమలు లేకుండా చూడాలి. ఇంటి చుట్టు పక్కల లేదా ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చేయాలి. దోమలకు ఇవే ఆవాసాలు కనుక నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చేయాలి.
చెత్తను కూడా శుభ్రం చేయాలి. ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులకు చెత్తను అందించాలి. ఇక దోమలను తరిమేందుకు యూకలిప్టస్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక స్ప్రే బాటిల్లో కొన్ని నీళ్లను తీసుకుని అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేయాలి. తరువాత బాగా కలపాలి. దీన్ని దోమలు ఉన్న చోట స్ప్రే చేయాలి. దీంతో దోమలు పారిపోతాయి. సిట్రొనెల్లా ఆయిల్ కూడా ఇలాగే అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని కూడా నీటిలో కలిపి ఉపయోగించాలి. దోమలను తరిమి కొట్టడంలో వేప నూనె కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. మార్కెట్లో మనకు పలు రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ లభిస్తాయి. ఇవన్నీ కూడా దోమలను తరిమికొట్టగలవు. లావెండర్ ఆయిల్, పెప్పర్ మింట్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, క్లోవ్ ఆయిల్, సినామన్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్.. ఇలా పలు రకాల ఆయిల్స్ లభిస్తాయి. వీటిలో ఏ ఆయిల్‌ను వాడినా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది.
దోమలను తరిమికొట్టాలంటే మీ ఇంట్లో కొన్ని రకాల ఇండోర్ మొక్కలను పెంచుకోవాలి. సిట్రొనెల్లా గ్రాస్ అని పిలవబడే ఓ రకమైన గడ్డిని ఇంట్లో పెంచాలి. ఇది మస్కిటో రీపెల్లెంట్ గుణాలను కలిగి ఉంటుంది. దీని వాసన దోమలకు నచ్చదు. దోమలను తరిమి కొడుతుంది. ఈ మొక్క నిమ్మ వాసన వస్తుంది. అందుకనే దోమలు పారిపోతాయి. లావెండర్ అనే మొక్కను ఇంట్లో పెంచుతున్నా కూడా దోమల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ మొక్క నుంచి వచ్చే వాసన కూడా దోమలకు పడదు. దోమలు దూరంగా పారిపోతాయి. తులసి మొక్క ఉన్న ఇంట్లోకి దోమలు రావని చెబుతారు. కనుక తులసి మొక్కను కూడా పెంచుకోవాలి. బంతి పూల మొక్కలను ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పెంచితే దోమల బెడద నుంచి రక్షణ లభిస్తుంది. బంతిపూలు వెదజల్లే వాసన దోమలకు నచ్చదు. దోమలు దూరంగా పారిపోతాయి.
పుదీనా మొక్కలను ఇంట్లో పెంచుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. పుదీనా ఆకుల నుంచి వచ్చే వాసన దోమలకు నచ్చదు. అవి దూరంగా పారిపోతాయి. లెమన్ బామ్ అనే మొక్కను పెంచుతున్నా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. దీని నుంచి వచ్చే ఘాటైన నిమ్మ వాసన దోమలకు నచ్చదు. ఇది దోమలను పారిపోయేలా చేస్తుంది. అలాగే రోజ్మేరీ మొక్కలను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇవి కూడా దోమల నుంచి రక్షణను అందిస్తాయి. కాట్నిప్, యూకలిప్టస్, వెల్లుల్లి మొక్కలను పెంచుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ దోమలు రాకుండా చేస్తాయి. అలాగే ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని కర్పూరం బిళ్లలను వేసి గదిలో పెట్టాలి. దాని నుంచి వచ్చే వాసనకు కూడా దోమలు పారిపోతాయి. అలాగే ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి అందులో లవంగాలను గుచ్చి గదిలో కిటికీలు లేదా దోమలు ఉండే ప్రాంతంలో పెట్టాలి. ఈ వాసనకు కూడా దోమలు పారిపోతాయి. ఇలా దోమలను తరిమి కొట్టవచ్చు.