Headache | ప్రస్తుతం చాలా మంది నిత్యం ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ఆందోళన కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో మానసికంగా తీవ్రంగా కుంగి పోతున్నారు. కొందరు డిప్రెషన్ బారిన కూడా పడుతున్నారు. దీని నుంచి బయట పడలేకపోతున్నారు. చాలా మందికి మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోంది. దీని కారణంగా తలనొప్పి కూడా వస్తోంది. అయితే తలనొప్పి వచ్చేందుకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడే అయినప్పటికీ ఇది వచ్చేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తలనొప్పి వస్తే చాలా మంది మెడికల్ షాపుల్లో లభించే మందులను తెచ్చి వేసుకుంటారు. దీంతో తాత్కాలికంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఇలా మందులను దీర్ఘకాలం పాటు వాడడం అంత మంచిది కాదు. కనుక ఈ మందులకు బదులుగా సహజసిద్ధమైన చిట్కాలను పాటించాలి. దీంతో తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. పైగా ఇది దీర్ఘకాలంలో మంచి ప్రభావం చూపిస్తుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది నిత్యం పని ఒత్తిడిలో పడి నీళ్లను సరిగ్గా తాగరు. దీంతో శరీరంలోని ద్రవాలు త్వరగా ఖర్చయిపోతాయి, డీహైడ్రేషన్ బారిన పడతారు. దీని వల్ల తలకు రక్త సరఫరా తగ్గిపోతుంది. ఇది తలనొప్పికి కారణం అవుతుంది. కనుక మీకు తలనొప్పిగా ఉంటే నీళ్లను బాగా తాగండి. అది నీళ్లను తాగకపోవడం వల్ల వచ్చిన నొప్పి అయితే నీళ్లను తాగిన వెంటనే ఇట్టే తగ్గిపోతుంది. తలనొప్పి తగ్గేందుకు చల్లని ప్యాక్ కూడా ఎంతగానో పనిచేస్తుంది. కొన్ని ఐస్ ముక్కలను ఒక వస్త్రంలో లేదా ప్లాస్టిక్ బ్యాగ్లో చుట్టి తలనొప్పి ఉన్న చోట మర్దనా చేసినట్లు పెడుతుండాలి. దీంతో తలకు రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మార్కెట్లో మనకు కోల్డ్ కంప్రెస్ ప్యాక్స్ కూడా లభిస్తాయి. వాటిల్లో ఐస్ ముక్కలను వేసి ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది.
తలనొప్పిగా ఉన్నవారు అల్లం టీని సేవిస్తున్నా ఫలితం ఉంటుంది. అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. రుచి కోసం నిమ్మరసం, తేనె కలపవచ్చు. ఇలా అల్లం టీని తాగుతుంటే తలనొప్పి నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. పెప్పర్ మింట్ ఆయిల్ కూడా ఈ సమస్యకు బాగానే పనిచేస్తుంది. ఇందులో మెంథాల్ ఉంటుంది. ఇది కండరాలను ప్రశాంతంగా మారుస్తుంది. దీంతో తలనొప్పి తగ్గిపోతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. కొబ్బరినూనె లేదా బాదంనూనెలో కొన్ని చుక్కల పెప్పర్మింట్ ఆయిల్ కలిపి తలపై నొప్పి ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి సున్నితంగా మర్దనా చేయాలి. దీంతో నొప్పి తగ్గిపోతుంది.
నుదురు, కణతలు, మెడ, భుజాలు వంటి భాగాలపై సున్నితంగా మర్దనా చేస్తున్నా ఉపయోగం ఉంటుంది. ఆయా భాగాల్లో దృఢంగా ఉండే కండరాలు వదులు అవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో తలనొప్పి తగ్గుతుంది. తలనొప్పికి కాఫీ కూడా చక్కని ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే కెఫీన్ రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తుంది. దీంతో తలనొప్పి తగ్గిపోతుంది. అయితే కెఫీన్ను రోజుకు 400 మిల్లీగ్రాములకు మించి తీసుకోరాదు. కనుక రోజుకు 2 లేదా 3 కప్పులకు మించి కాఫీని తాగకూడదు. మెగ్నిషియం అధికంగా ఉండే పాలకూర, నట్స్, విత్తనాలు, డార్క్ చాక్లెట్ వంటి ఆహారాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇవి నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. తలలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే తలనొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు.