Dandruff | ప్రస్తుత తరుణంలో చాలా మందిని జుట్టు సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటిల్లో ప్రధానంగా చుండ్రు సమస్య కూడా ఒకటి. చుండ్రు వల్ల అనేక అవస్థలు పడుతున్నారు. నలుగురిలో ఉన్నప్పుడు చుండ్రు ఇబ్బందికి గురి చేస్తోంది. తల నిండా, భుజాలపై చుండ్రు పడుతుండడంతో నలుగురిలోకి వెళ్లాలన్నా కూడా చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రధానంగా చుండ్రు వస్తుంది. ఇలా వస్తే ఒక పట్టాన చుండ్రు తగ్గదు. అయితే ఇందుకు ఖరీదైన చికిత్సలు అవసరం లేదు. పలు ఇంటి చిట్కాలు చాలు. వీటిని పాటిస్తే చుండ్రును సమర్థవంతంగా తరిమికొట్టవచ్చు. అంతేకాదు శిరోజాలు ఒత్తుగా, దృఢంగా కూడా పెరుగుతాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
చుండ్రును తగ్గించేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కుదుళ్లు, జుట్టు పీహెచ్ స్థాయిలను సరిచేస్తుంది. చుండ్రుకు కారణం అయ్యే ఫంగస్ పెరగకుండా నిరోధిస్తుంది. జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందుకు గాను యాపిల్ సైడర్ వెనిగర్, నీళ్లను సమాన భాగాల్లో తీసుకోవాలి. షాంపూ చేసిన తరువాత ఆ మిశ్రమాన్ని జుట్టు, కుదుళ్లకు తగిలేలా బాగా పట్టించాలి. జుట్టును సున్నితంగా మర్దనా చేయాలి. 5 నుంచి 15 నిమిషాలు ఆగిన తరువాత నీళ్లతో కడిగేయాలి. వారంలో కనీసం 2 సార్లు ఇలా చేస్తుంటే చుండ్రు నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. అయితే ఈ మిశ్రమం కళ్లలో పడకుండా చూసుకోండి. యాపిల్ సైడర్ ను నేరుగా జుట్టుకు రాయకూడదు. నీళ్లలో కలిపి మాత్రమే వాడాలి.
చుండ్రును తగ్గించడంలో కొబ్బరినూనె కూడా బాగానే పనిచేస్తుంది. కొబ్బరి నూనె జుట్టుకు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గిస్తాయి. జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. శిరోజాలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను తీసుకుని జుట్టుకు బాగా మర్దనా చేయాలి. 1 గంట పాటు వేచి ఉండాలి. అనంతరం షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు చేస్తుంటే తప్పక ఫలితం కనిపిస్తుంది. టీ ట్రీ ఆయిల్ కూడా చుండ్రును తొలగించగలదు. టీ ట్రీ ఆయిల్ లోనూ యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తొలగిస్తాయి. మీరు వాడే షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి వాడవచ్చు. లేదా కొబ్బరినూనెలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను కలిపి రాయవచ్చు. తరువాత కాసేపు ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.
వేపాకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. తలలో ఉండే దురదను, చుండ్రును తగ్గిస్తాయి. వేపాకులను కొన్ని తీసుకుని పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని నేరుగా తలకు పట్టించాలి. 60 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే చుండ్రు తప్పక పోతుంది. అదేవిధంగా కలబంద గుజ్జు కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును, దాని కారణంగా వచ్చే దురదను తగ్గిస్తాయి. కొద్దిగా తాజా కలబంద గుజ్జును తీసుకుని జుట్టుకు నేరుగా పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా చుండ్రు తగ్గిపోతుంది. ఇలా పలు ఇంటి చిట్కాలను ఉపయోగించి చుండ్రు సమస్య నుంచి శాశ్వతంగా బయట పడవచ్చు.