Multani Mitti | చర్మం కాంతివంతంగా మారి అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా ముఖ సౌందర్యం పెరగాలని స్త్రీలే కాదు, పురుషులు కూడా బ్యూటీ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లడం, ఖరీదైన చికిత్సలు చేయించుకోవడం చేస్తున్నారు. అయితే అంత ఖర్చు పెట్టి ఖరీదైన చికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండానే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మీ అందాన్ని నాచురల్‌గా పెంచుకోవచ్చు. అందుకు కావల్సిందల్లా మీరు కాస్త సమయాన్ని వెచ్చించడమే. శ్రమ అనుకోకుండా పలు ఇంటి చిట్కాలను పాటిస్తే మీ అందాన్ని మీరే పెంచుకోవచ్చు. అందుకు ముల్తాని మట్టి ఎంతో సహాయ పడుతుంది. దీన్ని అనేక సౌందర్య సాధన ఉత్పత్తులతోపాటు బ్యూటీ పార్లర్ల వారు కూడా సౌందర్య చికిత్సకు ఉపయోగిస్తారు. దీంతో ఎలాంటి చిట్కాలను పాటించవచ్చో ఇప్పుడు చూద్దాం.
మీ చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు ముల్తాని మట్టి ఎంతగానో దోహదపడుతుంది. దీన్ని పలు పదార్థాలతో కలిపి ఫేస్ ప్యాక్‌లా ఉపయోగిస్తే ఎంతో మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ముల్తానీ మట్టిలో కాస్త పెరుగు, కీరదోస గుజ్జు, శనగ పిండి వేసి బాగా కలుపుతూ అందులో పాలను కూడా పోయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతోపాటు మెడకు కూడా పట్టించాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. వారంలో 2 రోజులు ఇలా చేస్తుంటే మీ చర్మం సహజసిద్ధంగా కాంతివంతంగా మారి నిగారింపును పొందుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. అలాగే ముల్తానీ మట్టిలో పెరుగు, నిమ్మరసం, పసుపు కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఇది కూడా చక్కని ఫేస్ ప్యాక్‌లా పనిచేస్తుంది. దీన్ని కూడా ముఖం, మెడ భాగాల్లో రాయాలి. ఆరిన తరువాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గి ముఖం అందంగా కనిపిస్తుంది.
ముల్తానీ మట్టిలో కాస్త ఆలుగడ్డల గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి. ఆరిన తరువాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఎండ వల్ల కందిపోయిన చర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. ముల్తానీ మట్టిలో కొబ్బరి నీళ్లు, చక్కెర కలిపి కూడా ఫేస్ ప్యాక్‌లా వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసిన తరువాత 15 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, ముడతలు పోతాయి. ముఖం ప్రకాశిస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.
ఒక కోడిగుడ్డు తెల్లసొనను పూర్తిగా తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మేర ముల్తానీ మట్టి వేసి బాగా కలపాలి. అవసరం అనుకుంటే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు. దీంతో ఫేస్ ప్యాక్ రెడీ అవుతుంది. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు రాయాలి. 20 నిమిషాలు అయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. కోడిగుడ్డులో ఉండే పోషకాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మృత కణాలను తొలగించి చర్మానికి మెరుపు తెస్తాయి. చర్మం సాగిపోయినట్లు కనిపించదు. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. అలాగే 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ రోజ్ వాటర్‌ను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ చిట్కా ఎంతగానో పనిచేస్తుంది. ఇలా ముల్తానీ మట్టితో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.