Hunger | తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే ఎవరికైనా సరే అజీర్తి సమస్య ఏర్పడుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఒకదాని తరువాత ఒకటి వస్తుంటాయి. ఇవన్నీ మనల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఈ క్రమంలో ఆకలి కూడా సరిగ్గా అవదు. ఏ ఆహారం కూడా తినాలనిపించదు. అయితే అజీర్తి సమస్య ఏర్పడేందుకు కేవలం ఆహారం మాత్రమే కాదు, ఇంకా పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. అతిగా ఆహారం తినడం, కొవ్వులు, కారం, మసాలాలు ఉండే ఆహారాలను అధికంగా తినడం, రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం, టీ, కాఫీలను అతిగా తాగడం, మద్యం సేవించడం, చాక్లెట్లను తినడం, శీతల పానీయాలను అధికంగా తాగడం, ఫైబర్ ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వంటి కారణాల వల్ల చాలా మందిలో అజీర్తి ఏర్పడుతుంది. దీంతో ఆకలి కూడా తగ్గిపోతుంది.
ఒత్తిడి అధికంగా ఉండడం, ఆందోళన పడడం, పొగ తాగడం, తిన్న వెంటనే పడుకుని నిద్రించడం, పెయిన్ కిల్లర్లను ఎక్కువగా వాడడం, పొట్టలో ఇన్ఫెక్షన్లు ఏర్పడడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంటాయి. అయితే అజీర్తి తగ్గేందుకు, ఆకలి పెరిగేందుకు పలు చిట్కాలను, సూచనలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో జాగ్రత్తలను పాటించాలి. తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ సార్లు తినాలి. దీంతో పొట్ట ఎల్లప్పుడూ లైట్‌గా ఉంటుంది. అజీర్తి రాకుండా ఉంటుంది. ఆకలి కూడా పెరుగుతుంది. అలాగే ఆహారాన్ని నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో జీర్ణ వ్యవస్థపై నెగెటివ్ ప్రభావం పడకుండా ఉంటుంది.
కారం, మసాలాలు ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి. కొవ్వు ఉండే ఆహారాలను తినే విషయంలోనూ జాగ్రత్తలను పాటించాలి. ఈ ఆహారాలను అధికంగా తింటే జీర్ణ వ్యవస్థపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. అలాగే నీళ్లను అధికంగా తాగాలి. సరైన మోతాదులో నీళ్లను తాగకపోయినా కూడా తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాదు. కనుక నీళ్లను తగు మోతాదులో తాగడం కూడా అవసరమే. అలాగే ప్రో బయోటిక్ ఆహారాలు అయిన పెరుగు, మజ్జిగను అధికంగా తీసుకోవాలి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అజీర్తి ఏర్పడకుండా చూస్తాయి. ఆకలిని పెంచుతాయి. రోజూ భోజనం చేయడానికి ముందు 1 టీస్పూన్ మోతాదులో అల్లం రసం సేవిస్తుండాలి. ఇది ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఆకలిని పెంచుతుంది.
పుదీనా ఆకులను నేరుగా అలాగే నమిలి తినవచ్చు. లేదా పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. బేకింగ్ సోడాను నీటిలో కలిపి తాగుతున్నా రూడా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి పెరుగుతుంది. అజీర్తిని తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా పనిచేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. భోజనం చేసిన అనంతరం గుప్పెడు సోంపు గింజలను నోట్లో వేసుకుని నమిలి తింటుండాలి. అలాగే కలబంద గుజ్జు కూడా ఇందుకు పనిచేస్తుంది. ఉదయం పరగడుపునే కలబంద గుజ్జును 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. ఈ విధంగా పలు చిట్కాలను, సూచనలను పాటిస్తే అజీర్తిని తగ్గించుకుని ఆకలిని పెంచుకోవచ్చు.