Cracked Heels | శీతాకాలంలో సహజంగానే చాలా మందికి పాదాల పగుళ్లు వస్తుంటాయి. కానీ కొందరికి అన్ని కాలాల్లోనూ ఈ సమస్య ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు నిలబడి ఉండడం, కేవలం వెనుక వైపు ఓపెన్ ఉండే షూస్ లేదా చెప్పులను ధరించడం, స్థూలకాయం, పలు రకాల చర్మ సమస్యలు ఉండడం వంటి కారణాల వల్ల పాదాల పగుళ్లు అనేవి కొందరికి అన్ని కాలాల్లోనూ వస్తుంటాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు పలు ఇంటి చిట్కాలు అద్భుతంగా పని చేస్తాయి. పాదాల పగుళ్లను తగ్గించేందుకు కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదంనూనె, నువ్వుల నూనె అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి పాదాల పగుళ్లను తగ్గించి చర్మాన్ని మృదువుగా, తేమగా మారుస్తాయి. రాత్రి పూట ఏదైనా ఆయిల్‌ను పాదాలకు రాయాలి. పాదాలకు సాక్స్ ధరించాలి. ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.
తేనె కూడా ఈ సమస్య నుంచి బయట పడేలా చేస్తుంది. తేనె చర్మానికి తేమను, మృదుత్వాన్ని అందిస్తుంది. మృత చర్మ కణాలను తొలగిస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్లీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి పాదాల పగుళ్లను నయం చేస్తాయి. తేనెను పాదాలకు రాసి 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. లేదా రాత్రి పూట తేనెను పాదాలకు రాసి సాక్సులను తొడగాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. బియ్యం పిండి పాదాల పగుళ్లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మృత చర్మ కణాలను సులభంగా తొలగిస్తుంది. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో 1 టేబుల్ స్పూన్ తేనె, కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని పాదాలకు రాసి 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా ఫలితం ఉంటుంది. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ మీ ఇంట్లో లేకపోతే సాధారణ వెనిగర్‌ను సైతం ఉపయోగించవచ్చు.
పెట్రోలియం జెల్లీ పాదాలకు సంరక్షణ ఇస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చి తేమగా ఉంచుతుంది. చలికాలంలో దీన్ని పగిలిన చర్మం కోసం ఉపయోగిస్తారు. దీన్ని పాదాల పగుళ్లను తగ్గించేందుకు కూడా ఉపయోగించవచ్చు. మీ పాదాలను 15 నిమిషాల పాటు గోరు వెచ్చని నీటిలో ఉంచాలి. తరువాత పాదాలను బయటకు తీసి తడి పూర్తిగా ఆరనివ్వాలి. అనంతరం పెట్రోలియం జెల్లీలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాయాలి. అనంతరం సాక్సులను తొడగాలి. రాత్రి పూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం పాదాలను కడగాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
అరటి పండ్లు, అవకాడో రెండు కూడా మాయిశ్చరైజింగ్ ఆయిల్స్, విటమిన్లను కలిగి ఉంటాయి. ఇవి పొడి చర్మాన్ని తేమగా మారుస్తాయి. చర్మం పగలకుండా చూస్తాయి. బాగా పండిన అరటి పండు గుజ్జులో బాగా పండిన అవకాడో గుజ్జును కాస్త కలిపి ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని పాదాలకు రాసి 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా వారంలో కనీసం 3 సార్లు చేస్తుంటే తప్పక ఫలితం ఉంటుంది. మీ పాదాలు సురక్షితంగా మారి అందంగా కనిపిస్తాయి. పాదాల పగుళ్లు తగ్గుతాయి. గ్లిజరిన్, రోజ్ వాటర్‌ను సమాన భాగాల్లో కలపాలి. అనంతరం అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాయాలి. 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు.