Bloating | గ్యాస్ ట్రబుల్ సమస్య సహజంగానే చాలా మందికి ఉంటుంది. గ్యాస్ రావడం అన్నది ఎవరికైనా సాధారణమే. కొందరికి నోట్లో నుంచి త్రేన్పుల రూపంలో గ్యాస్ బయటకు పోతుంది. కొందరికి వెనుక నుంచి గ్యాస్ వస్తుంది. అయితే రోజంతా గ్యాస్ వస్తూనే ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించదు. గ్యాస్ ట్రబుల్ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. సరైన టైముకు భోజనం చేయకపోవడం, అతిగా తినడం, రాత్రి పూట ఆలస్యంగా తినడం, ఎక్కువ సేపు మేల్కొని ఉండడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, గంటల తరబడి కూర్చుని పనిచేస్తూ ఉండడం, శీతల పానీయాలను అధికంగా సేవించడం, కారం, మసాలాలు ఉండే ఆహారాలను అధికంగా తినడం, పలు రకాల మందులను వాడడం వల్ల కూడా గ్యాస్ సమస్య వస్తుంది. అయితే గ్యాస్ సమస్య ఉంటే చాలా మంది మెడిసిన్లను వాడుతారు. కానీ వాటితో పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధంగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
గ్యాస్ సమస్య ఉన్నవారికి అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అల్లంలో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. ఇది పేగుల కండరాలను ప్రశాంత పరుస్తుంది. గ్యాస్ సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది. చిన్న అల్లం ముక్కను భోజనం చేసిన అనంతరం తింటుండాలి. లేదా భోజనానికి ముందు 1 టీస్పూన్ మోతాదులో అల్లం రసం సేవించవచ్చు. భోజనం అనంతరం చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. ఇలా అల్లాన్ని తీసుకున్నా కూడా గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. అలాగే భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తింటున్నా కూడా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్ ఏర్పడదు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. సోంపు గింజలను వేసి మరిగించిన నీళ్లను తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. గ్యాస్ సమస్యను తగ్గించడంలో సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.
వాములో శక్తివంతమైన కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. ఈ గింజల్లో థైమోల్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. భోజనం చేసిన అనంతరం ఒక టీస్పూన్ వాము గింజలను కాస్త నల్ల ఉప్పుతో కలిపి నేరుగా అలాగే తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. లేదా వాము గింజలను వేసి మరిగించిన నీళ్లను కూడా తాగవచ్చు. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్ని జీర్ణ సమస్యలను తగ్గించడంలో జీలకర్ర కూడా బాగానే పనిచేస్తుంది. జీలకర్రను కాస్త తీసుకుని పెనంపై వేయించి పొడిగా చేయాలి. దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగాలి. లేదా జీలకర్రను వేసి మరిగించిన నీళ్లను తాగుతున్నా కూడా గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
మనం వంటల్లో వాడే ఇంగువ గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఫ్లాటులెంట్ గుణాలు ఉంటాయి. ఇంగువను కొద్దిగా తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. లేదా మీరు చేసే కూరల్లో ఇంగువను వేస్తుండాలి. దీంతో గ్యాస్ రాకుండా అడ్డుకోవచ్చు. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో పుదీనా ఆకులు కూడా బాగానే పనిచేస్తాయి. పుదీనా ఆకుల రసాన్ని మజ్జిగలో కలిపి తాగుతుంటే గ్యాస్ తగ్గుతుంది. లేదా పుదీనా ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. భోజనం చేసిన అనంతరం ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి తినాలి. ఇది కూడా ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇలా సహజసిద్ధమైన చిట్కాలను పాటించి గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా కూడా ఉంటుంది.