Mind Diet | ఆరోగ్యంగా ఉండేందుకు మనకు అనేక రకాల డైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ సౌకర్యానికి అనుగుణంగా ఉండే డైట్‌ను పాటిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఒక డైట్ మాత్రం బాగా ట్రెండింగ్‌లో ఉంది. అదే మైండ్ డైట్. రెండు రకాల డైట్లను కలిపి ఈ డైట్‌ను రూపొందించారు. మెడిటరేనియన్తోపాటు డ్యాష్ డైట్‌ను కలిపి మైండ్ డైట్‌ను రూపొందించారు. రష్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు ఈ డైట్‌కు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా పలు ఆహారాలను వారంలో నిర్దిష్టమైనన్ని సార్లు కచ్చితంగా తీసుకోవాలి. అలాగే కొన్ని ఆహారాలను తీసుకోవడం మానేయాలి. లేదా వారంలో చాలా తక్కువ సార్లు తీసుకోవాలి. ఇలా మైండ్ డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మైండ్ డైట్లో బాగంగా వారంలో కనీసం 6 సార్లు కూరగాయలు, ఆకుకూరలను తినాలి, పిండి పదార్థాలు లేని కూరగాయలను ఏదో ఒకటి కచ్చితంగా రోజూ తినాలి. వారంలో కనీసం 2 సార్లు బెర్రీలను తినాలి. వారంలో కనీసం 5 సార్లు నట్స్‌ను తీసుకోవాలి. రోజూ ఆలివ్ ఆయిల్‌ను వంటలకు కచ్చితంగా ఉపయోగించాలి. ఓట్ మీల్, బ్రౌన్ రైస్‌ను వారంలో కనీసం 3 సార్లు తినాలి. వారానికి ఒకసారి చేపలను కచ్చితంగా తినాలి. వారంలో 3 సార్లు బీన్స్, వారానికి 2 సార్లు చికెన్ లేదా కోడిగుడ్లను, రోజుకు ఒక గ్లాస్ వైన్‌ను (వీలుంటే) తాగాలి. ఇలా మైండ్ డైట్లో భాగంగా ఈ ఆహారాలను కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
మైండ్ డైట్‌ను పాటించే వారు మటన్ తినకూడదు. లేదా వారంలో ఒకసారి తినవచ్చు. అంతకు మించరాదు. వెన్న, నెయ్యి రోజుకు ఒక టీస్పూన్ మించకూడదు. చీజ్‌ను వారంలో ఒకసారి మాత్రమే తినవచ్చు. పేస్ట్రీలు, స్వీట్లను కూడా వారంలో ఒకసారి మాత్రమే తినాలి. వేపుళ్లను కూడా వారంలో ఒకసారి మించి తినకూడదు. ఇక మైండ్ డైట్‌ను పాటిస్తే అనేక లాభాలను పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మైండ్ డైట్‌ను పాటించడం వల్ల అల్జీమర్స్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వయస్సు మీద పడిన వారిలో అల్జీమర్స్ అధికంగా వస్తుంది. కానీ మైండ్ డైట్‌ను పాటిస్తే అల్జీమర్స్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే మెదడు యాక్టివ్‌గా మారి ఉత్తేజంగా పనిచేస్తుంది. బద్దకం పోతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వృద్ధాప్యంలో మతిమరుపు కూడా రాకుండా అడ్డుకోవచ్చు.
మైండ్ డైట్‌ను పాటిస్తే శరీరానికి అనేక విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్లు ఎ, కె, బి విటమిన్లు పొందవచ్చు. ఫోలేట్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా లభిస్తాయి. ఇవి మెదడును సంరక్షిస్తాయి. కణాలు వాపులకు గురి కాకుండా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మైండ్ డైట్ వల్ల హృదయ సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మైండ్ డైట్‌ను పాటిస్తే తీవ్రమైన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ డైట్‌ను పాటించడం అంత తేలికేమీ కాదని, న్యూట్రిషనిస్టులతోపాటు డాక్టర్ సలహాను పాటించి మాత్రమే ఈ డైట్‌ను అనుసరించాలని, అప్పుడే ఉత్తమ ఫలితాలను రాబట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.