Fatty Liver Symptoms | ప్రస్తుతం చాలా మందికి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలా మారింది. దీని వల్ల దాదాపుగా అందరికీ అనేక వ్యాధులు వస్తున్నాయి. వాటిల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఫ్యాటీ లివర్‌ను వైద్య పరిభాషలో హెపాటిక్ స్టియాటోసిస్ అంటారు. లివర్‌లో అధికంగా ద్రవాలు చేరడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీన్నే సైలెంట్ డిసీజ్ అని కూడా అంటారు. ఫ్యాటీ లివర్ ఆరంభంలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ కొందరిలో పలు లక్షణాలు కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే లివర్ డ్యామేజ్ అయి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో తీవ్రమైన నీరసం కనిపిస్తుంది. ఆహారం తీసుకుంటున్నా, తగినంత నిద్ర కూడా ఉన్నా కూడా తీవ్రంగా నీరసం వస్తుంది. చిన్న పనిచేసినా అలసిపోతారు. శరీరంలో అధికంగా టాక్సిన్లు చేరడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో ఫ్యాటీ లివర్ వస్తుంది.
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో పొట్టలో లేదా ఆ భాగంలో అసౌకర్యంగా అనిపిస్తుంది. కొందరికి నొప్పి కూడా ఉంటుంది. ఛాతి ఎముకల కింది భాగంలో నొప్పిగా కూడా ఉంటుంది. ముఖ్యంగా కుడి వైపు లివర్ ఉన్న చోట ఇది ఎక్కువగా వస్తుంది. లివర్ వాపులకు గురైతే ఇలా నొప్పి వస్తుంది. దీన్ని కూడా ఫ్యాటీ లివర్ వచ్చిందనడానికి సంకేతంగా చెప్పవచ్చు. ఈ వ్యాధి ఉన్నవారు అసాధారణ రీతిలో బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొట్ట భారీగా పెరుగుతుంది. ఇన్సులిన్ నిరోధకత అధికంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇది ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుంది. కనుక ఈ లక్షణం కనిపించినా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే వికారంగా అనిపిస్తుంది. వాంతికి వచ్చినట్లు ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. ఆహారం అసలు తినాలనిపించదు.
ఫ్యాటీ లివర్ ఉండే ఇన్సులిన్ నిరోధకత కారణంగా చర్మం ముడతలు పడిన చోట నలుపు రంగులోకి మారుతుంది. మెడ భాగంలో, చంకల్లో నలుపు దనం ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు పలుచగా మారుతుంది. మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవన్నీ ఫ్యాటీ లివర్ ఉందని చెప్పేందుకు లక్షణాలుగా భావించవచ్చు. ఫ్యాటీ లివర్ ఉంటే కొందరికి పచ్చ కామెర్లు అవుతాయి. అందువల్ల పచ్చ కామెర్లు అయిన వారు ఫ్యాటీ లివర్ వచ్చిందేమో కూడా చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే పాదాలు, పొట్ట భాగంలో వాపులు రావడం, ఏకాగ్రత లోపించడం, ఏ విషయంపై కూడా ధ్యాస పెట్టలేకపోవడం, చర్మం కింది భాగంలో సాలెగూడులా రక్త నాళాలు మారి బయటకు కనిపించడం వంటివన్నీ ఈ సమస్యకు సంకేతాలుగా చెప్పవచ్చు.
ఫ్యాటీ లివర్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. మద్యం అతిగా సేవించడం, కొవ్వు ఉండే ఆహారాలను అధికంగా తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, స్థూలకాయం, డయాబెటిస్ ఉండడం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వంటివన్నీ ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు క్రమం తప్పకుండా మందులను వాడడంతోపాటు ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాధి ఉన్నవారు తాజా పండ్లు, కూరగాయలను అధికంగా తినాలి. ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. బెర్రీ పండ్లు, బీట్ రూట్ ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్, బ్రౌన్ రైస్, కినోవా, ఆలివ్ ఆయిల్, అవకాడో, వాల్ నట్స్, బాదంపప్పు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చేపలు, అవిసె గింజలు, టోఫు, పప్పు దినుసులు, శనగలు, కాఫీ, వెల్లుల్లి, గ్రీన్ టీ, పసుపు వంటివన్నీ లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్యాటీ లివర్ నుంచి త్వరగా బయట పడేలా చేస్తాయి. కనుక ఈ ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.