Fatty Liver | భారత్‌లో ఊబకాయం, మధుమేహం, ఇతర మెటబాలిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్యాటీ లివర్ వ్యాధిని ఇప్పుడు కేవలం కాలేయానికి సంబంధించిన సమస్యగా లేదా పెద్ద నగరాల్లో మాత్రమే కనిపించే అనారోగ్యంగా భావించలేం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా చాలా మందిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకుండానే ఈ వ్యాధి అభివృద్ధి చెందుతుండటంతో, ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్ మరింత కీలకంగా మారాయి. ఫ్యాటీ లివర్ వ్యాధిని ప్రస్తుతం మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ)గా పిలుస్తున్నారు. ఈ వ్యాధి అధికంగా మద్యం తీసుకునే వారికే వస్తుందనుకోవడం తప్పు. ఊబకాయం, టైప్-2 మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో కూడా ఇది బలమైన సంబంధం కలిగి ఉంటుంది. దేశంలో ఈ పరిస్థితులు పెరుగుతుండటంతో ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఎక్కువవుతోంది. ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
ఎంఏఎస్ఎల్డీ సాధారణంగా చాలా సంవత్సరాల పాటు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. ప్రారంభ దశలో ప్రత్యేకమైన లక్షణాలు కనిపించకపోవడంతో చాలామందికి తమకు ఈ సమస్య ఉన్న విషయం తెలియదు. సాధారణ ఆరోగ్య పరీక్షలు లేదా ఇతర కారణాలతో వైద్య పరీక్షలు చేయించుకున్న సమయంలోనే కాలేయంలో మార్పులు బయటపడుతున్నాయి. అయితే చికిత్స లేకుండా వ్యాధి కొనసాగితే కాలేయంలో వాపు, మచ్చలు ఏర్పడటం, సిరోసిస్, కాలేయ వైఫల్యం, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో కాలేయ మార్పిడి అవసరమయ్యే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ ప్రాధాన్యత కేవలం కాలేయానికి కలిగించే నష్టంతోనే పరిమితం కాదు. ఇది మధుమేహం, గుండె జబ్బులు, మెటబాలిక్ వ్యాధుల కారణంగా చిన్న వయసులోనే మరణించే ప్రమాదం పెరగడానికి కూడా ఒక సూచికగా ఉంటుంది. వ్యాధి ముదిరిన తర్వాత అవసరమయ్యే దీర్ఘకాలిక వైద్యం, పర్యవేక్షణ రోగులతో పాటు వారి కుటుంబాలపై ఆర్థికంగా, మానసికంగా కూడా గణనీయమైన భారాన్ని మోపుతుంది.
దేశంలో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడానికి ఇటీవలి సంవత్సరాల్లో మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అధిక కేలరీల ఆహారం తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి, ఊబకాయం, మధుమేహం పెరుగుదలతో ఈ సమస్యకు సంబంధం ఉంది. గతంలో ఫైబర్, సంపూర్ణ ఆహారాలతో కూడిన సంప్రదాయ ఆహార విధానాల స్థానంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, ప్యాకేజ్డ్ స్నాక్స్ ఎక్కువగా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఎక్కువ పని గంటలు, శారీరక శ్రమ తగ్గడం వంటి అంశాలు మెటబాలిక్ సమస్యలను మరింత పెంచుతున్నాయి. కాలక్రమేణా ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు, కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఇప్పుడు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై వంటి నగరాల్లో దీని ప్రాబల్యం 37 నుంచి 42 శాతం మధ్య ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రూర్కీ, భోపాల్ వంటి నగరాల్లో ఈ రేటు 50 శాతం వరకు నమోదైనట్లు వెల్లడించారు. దీంతో ఫ్యాటీ లివర్ దేశవ్యాప్తంగా ఎదురవుతున్న మెటబాలిక్ ఆరోగ్య సమస్యగా మారింది.
ఎంఏఎస్ఎల్డీని ఎదుర్కోవడంలో ప్రధాన సవాళ్లలో ఒకటి వ్యాధి ముదిరిన తర్వాతే చాలామంది వైద్యులను సంప్రదించడం. కాలేయంలో ఫైబ్రోసిస్, అంటే మచ్చలు ఏర్పడిన తర్వాతే కొందరికి సమస్య బయటపడుతోంది. అలసట, బలహీనత, పొత్తికడుపులో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించే సమయానికి వ్యాధి గణనీయంగా ముందుకు వెళ్లి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకుండా ముందుగానే మెటబాలిక్ స్క్రీనింగ్ చేయించుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు. సాధారణ లివర్ ఫంక్షన్ టెస్టులు (ఎల్ఎఫ్టీ) కాలేయానికి సంబంధించిన ప్రారంభ మార్పులను గుర్తించడంలో సహాయపడతాయి. అలాగే హెచ్‌బీఏ1సీ, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల ద్వారా ఫ్యాటీ లివర్‌తో సంబంధం ఉన్న మధుమేహం, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ వంటి మెటబాలిక్ సమస్యలను గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్, ఫైబ్రోస్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలతో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, ఫైబ్రోసిస్ స్థాయిని అంచనా వేయవచ్చు. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ప్రత్యేకమైన డయాగ్నస్టిక్ సదుపాయాలు, హెపటాలజీ నిపుణుల అందుబాటు పరిమితంగా ఉన్న నేపథ్యంలో ముందస్తు స్క్రీనింగ్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఫ్యాటీ లివర్ విషయంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రారంభ దశలో గుర్తిస్తే కాలేయానికి కలిగే నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు. కొన్ని సందర్భాల్లో నష్టం తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులు చికిత్సలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొన్ని చికిత్సా విధానాలు కూడా ఈ రంగంలో ఆశాజనక ఫలితాలను చూపిస్తున్నాయి. ఆరిజినేటర్ సెమాగ్లూటైడ్ వంటి కొత్తగా ఆమోదం పొందిన చికిత్సలు స్టియాటోహెపటైటిస్ను తగ్గించడంతోపాటు కాలేయ ఫైబ్రోసిస్‌ను తగ్గించడంలో సహాయపడినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రయోజనాలు కేవలం బరువు తగ్గడం వల్ల మాత్రమే కాకుండా, కాలేయ ఆరోగ్యంపై మరింత విస్తృతమైన ప్రభావం ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు. భారత్‌లో ఊబకాయం, మధుమేహం, ఇతర మెటబాలిక్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్యాటీ లివర్‌ను చిన్న సమస్యగా తీసుకోవడం సరికాదు. ప్రజల్లో అవగాహన పెంచడం, స్క్రీనింగ్ సదుపాయాలను విస్తరించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి జోక్యం చేసుకోవడం ద్వారా దీని తీవ్రతను తగ్గించవచ్చు. ముఖ్యంగా లక్షణాలు కనిపించకముందే ఎంఏఎస్ఎల్డీని గుర్తించడం అత్యంత కీలకం. ప్రారంభ దశలో జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి ముదరకుండా అడ్డుకోవడమే కాకుండా, అనేక సందర్భాల్లో కాలేయానికి కలిగే నష్టాన్ని తిరిగి తగ్గించే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.