నేను ఐటీ ఉద్యోగిని. మంచి జీతం. బాగా చదువుకున్నాను. అందంగా ఉంటాను. ఇన్ని అర్హతలు ఉన్నప్పుడు.. నా జీవిత భాగస్వామి ఎలా ఉండాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు లేదా? ఎత్తు, రంగు, ఆస్తిపాస్తులు.. ఇలా ఏదో ఓ విషయంలో రాజీ పడాల్సిందేనని అమ్మానాన్నలు అంటున్నారు. ఆ సర్దుబాటు ధోరణి నాకు నచ్చదు. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. బయటికి వచ్చి ఒంటరిగా జీవించాలని అనుకుంటున్నా. మీ సలహా చెప్పండి.
ప్రతి మనిషిలోనూ రెండు కోణాలు ఉంటాయి. బయటికి కనిపించే స్వరూపం వేరు. లోలోపలి స్వభావం వేరు. ఆ తేడా కొందరిలో తక్కువగా ఉంటుంది. కొందరిలో ఎక్కువగా ఉంటుంది. ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. ఈ రిస్క్‌ను భరించాల్సిందే. అందగాడు, పొడగరి, విద్యావంతుడు, సంపాదనపరుడు.. ఈ చెక్‌లిస్ట్ చూసుకోగానే సరిపోదు కదా? పెళ్లి తర్వాత.. అతను మీరు ఊహించిన దానికంటే మంచివాడని తేలవచ్చు.
పరమదుర్మార్గుడనీ అర్థం కావచ్చు. కాబట్టి, ఎంచుకోబోయే వ్యక్తి గుణగణాలను బేరీజు వేయండి. ఒక వ్యక్తి మీకు తగినవాడు.. అనిపించగానే నిర్ణయం తీసేసుకోకండి. అతనితో మాట్లాడండి. అతని స్నేహితులు, బంధువులు, కొలీగ్స్ ద్వారా కూడా కొంత సమాచారం రాబట్టండి. ఆ తర్వాతే అంతిమ నిర్ణయం తీసుకోండి. మీ జీవితానికి సంబంధించి ఇదొక కీలక దశ. కన్నవారి అభిప్రాయాన్ని తీసుకోవడంలో తప్పులేదు. రాజీ పడటం అనే మాట సరికాదు కానీ.. జీవితంలో పట్టువిడుపులు తప్పకపోవచ్చు. ఆ మేరకు మనం సిద్ధంగా ఉండాలి.