రోజువారీ శరీర శుభ్రతలో షాంపూ వినియోగం చాలా సహజమైన అంశంగా మారిపోయింది. అందరూ తమ తల వెంట్రుకలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలి, అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే, ఇటీవలి కొన్ని అధ్యయనాలు షాంపూలో వాడే కొన్ని రసాయనాలతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉండొచ్చని ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కాబట్టి, షాంపూ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సంప్రదాయ, ప్రజాదరణ పొందిన షాంపూలు తల శుభ్రం చేయడానికి, నురగ రావడానికి, సువాసన వేయడానికి ఎన్నో రసాయనాలను మేళవించి ఉంటాయి. ప్రిజర్వేటివ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. వీటిని వాడుతుంటే దీర్ఘకాలంలో వీటిలో ఉండే కొన్ని రసాయనాలకు క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలతో లంకె ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే, స్వల్ప పరిమాణంలో వాడితే మాత్రం అంత హానికరం కావని చెబుతున్నారు.
ఫార్మాల్డీహైడ్, ఫార్మాల్డీహైడ్ విడుదల చేసే ప్రిజర్వేటివ్స్: వీటిని బ్యాక్టీరియా వృద్ధిని అరికట్టడానికి వాడతారు. అయితే, ఫార్మాల్డిహైడ్‌ను క్యాన్సర్ కారకంగా పరిగణిస్తారు.
సోడియం లారైల్ సల్ఫేట్, సోడియం లారేత్ సల్ఫేట్: ఇవి నురగ వచ్చేలా చేస్తాయి. మాడు దురదకు కారణమవుతాయి. వీటిలో 1, 4 డయాక్సేన్ మూలాలు ఉంటాయి. ఇవి కూడా క్యాన్సర్ కారకాలే.
థాలేట్స్: ఇది కృత్రిమ సువాసన కారకం. హార్మోన్ల పనితీరు దెబ్బతీయడం, రొమ్ము క్యాన్సర్ల లాంటివాటితో సంబంధం ఉందని నిపుణులు
చెబుతున్నారు.
పారాబెన్స్: వీటిని ప్రిజర్వేటివ్స్‌గా వాడతారు. కొన్ని అధ్యయనాల మేరకు పారాబెన్స్కు రొమ్ము క్యాన్సర్‌కు లంకె ఉంది. అయితే, తగిన ఆధారాలు లేవు.
అయినప్పటికీ షాంపూ వల్లే క్యాన్సర్లు వస్తాయని నిపుణులు బలంగా చెప్పడం లేదు. ఎన్నిసార్లు వాడుతున్నారు, జన్యుపరమైన కారణాలు, ఎంతమేరకు ప్రభావం చూపుతుంది, టాక్సిన్లు ఎంతమోతాదులో ఉన్నాయి తదితర అంశాల మీద ఇది ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.
షాంపూలు వాడకుండా ఉండలేం కాబట్టి, ఫార్మాల్డిహైడ్, పారాబెన్స్, డీఎండీఎం హైడన్టోయిన్, థాలేట్స్, ఫ్రాగ్రాన్స్ లాంటివి ఉంటే ఆ ఉత్పత్తులను ఎంచుకోకూడదు. షాంపూల లేబుల్స్ జాగ్రత్తగా చదవాలి. పారాబెన్, సల్ఫేట్ లేనివి ఎంచుకోవాలి. ఈడబ్ల్యూజీ వెరిఫైడ్, యూఎస్డీఏ ఆర్గానిక్ వెరిఫై చేసిన వాటిని ఎంపిక చేసుకోవాలి. మీరూ సొంతంగా తగినన్ని వివరాలు తెలుసుకుని ఉంటే మంచిది.