న్యూఢిల్లీ : మధుమేహ బాధితులు వ్యాధి నియంత్రణలో ఉంచుకోవడం ఏమంత సులభం కాదు. సమతులాహారం, మెరుగైన జీవనశైలి, మందులతో మధుమేహాన్ని సమర్ధంగా నియంత్రించేందుకు శ్రమిస్తుంటారు. అయితే నిరంతరం ఒత్తిడికి లోనవడం, అలసట డయాబెటిక్ బర్నవుట్‌కు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ బర్నవుట్‌తో బాధపడే వారు మధుమేహాన్ని సమర్ధంగా నిర్వహించడంలో అలిసిపోతుంటారని డయాబెటిస్ కేర్ నిపుణులు అండ్రియా న్యుకమ్ చెబుతున్నారు.
డయాబెటిస్ బర్నింగ్ అనే పదానికి సరైన నిర్వచనం లేదని అమెరికన్ జర్నల్ ఆఫ్ నర్సింగ్ పేర్కొంది. అయితే దీని బారినపడిన వారిలో కుంగుబాటు భావన, డయాబెటిస్ కంట్రోల్‌కు చేపట్టాల్సిన చర్యలు, నిర్వహణలో అలిసిపోతారని వివరించింది. డయాబెటిస్ బర్నవుట్ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహ రోగుల్లో 30 శాతం మంది డయాబెటిస్ బర్నవుట్ బారిన పడుతుంటారని నిపుణులు పేర్కొంటున్నారు. డయాబెటిస్ బర్నవుట్ను అధిగమించేందుకు ముందుగా ఆ పరిస్ధితిని అంగీకరించి సానుకూల దృక్పదంతో ముందుకు సాగాలని చెబుతున్నారు. తమ సమస్యను వైద్యులతో చర్చించి చక్కదిద్దుకునే దిశగా ప్రయత్నాలు చేపట్టాలి. మధుమేహ నియంత్రణ దీర్ఘకాలం నిర్వహించాల్సిన క్రమంలో ఆరోగ్యంపై బాధితులు దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక రోజంతా ఉత్సాహంగా ఉండేలా చూసుకోవడం ద్వారా ఒత్తిడిని చిత్తు చేసి ఉత్తేజంగా గడపవచ్చు.