Flavonols | గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం కొవ్వు పదార్థాలు, చక్కెర తీసుకోవడం తగ్గించడం మాత్రమే సరిపోదు. సహజసిద్ధంగా మొక్కల ఆధారిత ఆహారాల్లో లభించే ఫ్లావనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంతోపాటు రక్త ప్రసరణను సక్రమంగా ఉంచడంలో, సాధారణ రక్తపోటును నిర్వహించడంలో సహాయపడతాయి. ఫ్లావనాల్స్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే అవకాశముందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే రోజువారీ ఆహారంలో ఫ్లావనాల్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
డార్క్ చాక్లెట్ ఫ్లావనాల్స్కు అత్యుత్తమ ఆహార వనరుల్లో ఒకటి. ముఖ్యంగా 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉండే డార్క్ చాక్లెట్లో ఈ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచడం, రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడడం, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఇందులో కేలరీలు, చక్కెర కూడా ఉండే అవకాశం ఉన్నందున పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. చక్కెర కలపని కోకో పొడి కూడా ఫ్లావనాల్స్కు మంచి మూలం. దీన్ని స్మూతీలు, ఓట్స్, పెరుగు లేదా ఇంట్లో తయారుచేసే పానీయాల్లో కలిపి తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. రోజుకు ఒక యాపిల్ తినడం గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తొక్కతో కలిపి తింటే ఫ్లావనాల్స్తోపాటు ఫైబర్, ఇతర పోషకాలు లభిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో దోహదపడతాయి.
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్ప్బెర్రీ వంటి బెర్రీ పండ్లలో ఫ్లావనాల్స్తోపాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను దెబ్బతీసే ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ జీవక్రియల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎరుపు, ఊదా రంగు ద్రాక్షపండ్లలో ఫ్లావనాల్స్తోపాటు ఇతర పాలీఫినాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరచి రక్త ప్రసరణను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. ద్రాక్షను నేరుగా తినవచ్చు లేదా సలాడ్లలో చేర్చుకోవచ్చు. గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండూ ఫ్లావనాల్స్కు అద్భుతమైన వనరులు. క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల రక్తనాళాల పనితీరు మెరుగుపడటంతోపాటు గుండె ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే చక్కెర కలిగిన పానీయాలకు బదులుగా టీని ఎంపిక చేసుకోవడం కూడా ఆరోగ్యకరమైన అలవాటు.
పియర్ పండ్లలో కూడా ఫ్లావనాల్స్తోపాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా సహాయపడతాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారంలో వీటిని చేర్చుకోవచ్చు. అయితే ఫ్లావనాల్స్ అధికంగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవడం వల్ల గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుందని భావించకూడదు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరిపడా నిద్ర, ఒత్తిడి నియంత్రణ, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు కూడా గుండెను కాపాడటానికి అత్యంత అవసరం. ఫ్లావనాల్స్ అధికంగా ఉండే ఆహారాలు ఈ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా తీసుకున్నప్పుడే వాటి పూర్తి ప్రయోజనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.