Mucus | ఛాతీలో బరువుగా అనిపించడం, పదే పదే దగ్గు రావడం, సరిగా శ్వాస తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఊపిరితిత్తుల్లో అధిక మ్యూకస్ పేరుకుపోవడం వల్ల కలుగుతాయి. జలుబు, అలర్జీలు, కాలుష్యం లేదా శ్వాసకోశ సమస్యల కారణంగా ఈ ఇబ్బంది మరింత పెరుగుతుంది. అయితే శరీరానికి సహజంగానే మ్యూకస్‌ను బయటకు పంపించే వ్యవస్థ ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సులభమైన అలవాట్లు పాటించడం ద్వారా ఊపిరితిత్తుల్లోని మ్యూకస్‌ను సహజంగా తగ్గించుకుని సులభంగా శ్వాస తీసుకోవచ్చని సూచిస్తున్నారు. సాధారణంగా మ్యూకస్ శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది దుమ్ము, బ్యాక్టీరియా, కాలుష్య కణాలు వంటి హానికర పదార్థాలను ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.
అయితే శరీరం అధికంగా మ్యూకస్ ఉత్పత్తి చేసినప్పుడు లేదా అది సరిగా బయటకు రాకపోతే సమస్యలు ప్రారంభమవుతాయి. జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, ధూమపానం, అధిక కాలుష్యం, ఆస్తమా లేదా బ్రాంకైటిస్ వంటి సమస్యల కారణంగా మ్యూకస్ ఎక్కువగా పేరుకుపోతుంది. ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఎక్కువగా పేరుకుపోయినప్పుడు నీటిని ఎక్కువగా తాగాలి. శరీరంలో తగినంత నీరు ఉండటం వల్ల మ్యూకస్ పలుచబడుతుంది. దీంతో అది సులభంగా బయటకు వస్తుంది. ముఖ్యంగా వేడి పానీయాలు తీసుకోవడం మంచిది. హెర్బల్ టీ, తేనె కలిపిన గోరువెచ్చని నీరు, సూప్‌లు వంటివి తాగాలి. ఇవి గొంతుకు ఉపశమనం ఇవ్వడంతోపాటు ఛాతీలోని బిగుతును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మ్యూకస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆవిరి పీల్చడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పాతకాలం నుంచి ఉపయోగిస్తున్న ఆవిరి పద్ధతి ఇప్పటికీ ప్రయోజనకరంగానే ఉంటుంది. వేడి ఆవిరి శ్వాసనాళాల్లోని మ్యూకస్‌ను సడలించి బయటకు రావడానికి సహాయపడుతుంది. వేడి నీటితో ఆవిరి పీల్చడం, వేడి నీటితో స్నానం చేసే సమయంలో యూకలిప్టస్ ఆయిల్ కొన్ని చుక్కలు వేస్తే మరింత ఉపశమనం లభిస్తుంది.
శ్వాస వ్యాయామాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. శ్వాసకోశ ఆరోగ్యానికి కొన్ని సులభమైన శ్వాస వ్యాయామాలు సహాయపడతాయి. ముక్కు ద్వారా నెమ్మదిగా గాలిని పీల్చి కొన్ని సెకన్లు ఆపి మళ్లీ నెమ్మదిగా వదలాలి. అలాగే గొంతుపై ఒత్తిడి లేకుండా నెమ్మదిగా దగ్గడం ద్వారా మ్యూకస్ బయటకు వస్తుంది. ఛాతీ కంటే పొట్ట విస్తరించేలా శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు ఎక్కువ గాలి చేరుతుంది. దీని వల్ల కూడా మ్యూకస్ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో లభించే కొన్ని సాధారణ వంటింటి పదార్థాలు శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అల్లం, పసుపు, తేనె వంటి వాటిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇండోర్ ఎయిర్ క్వాలిటీ కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇంట్లో గాలి సరిగా ఆడేలా చూడాలి. దుమ్ము, పొగ, కెమికల్ వాసనల నుంచి దూరంగా ఉండాలి. అవసరమైతే ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలి. వీటితో పాటు శారీరక కదలికలు ఉండడం కూడా చాలా ముఖ్యం. చిన్నపాటి వ్యాయామం కూడా మ్యూకస్‌ను సడలించడంలో సహాయపడుతుంది. నడక, యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు వంటి చేయడం మంచిది. ఎక్కువసేపు పడుకుని ఉండటం వల్ల మ్యూకస్ ఛాతీలోనే పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కనుక ఎక్కువ సమయం పడుకోవడాన్ని నివారించడం మంచిది.
సహజ పద్ధతులు కొంతవరకు ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ సమస్య కొన్ని వారాలకంటే ఎక్కువ కొనసాగినా, జ్వరం వచ్చినా, ఛాతీలో నొప్పి, మ్యూకస్లో రక్తం కనిపించడం వంటి సమస్యలు కనిపించినా వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. ఇవి బ్రాంకైటిస్, ఆస్తమా లేదా ఇతర ఇన్ఫెక్షన్ల లక్షణాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊపిరితిత్తుల్లో మ్యూకస్ పేరుకుపోవడం అసౌకర్యంగా ఉన్నప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే ఉపశమనం పొందవచ్చు. తగినంత నీరు తాగడం, ఆవిరి పీల్చడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా శ్వాసను సులభతరం చేసుకోవచ్చు. సమస్య తీవ్రమైతే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.