వ్యాక్సినేషన్ అంటే ఇంజెక్షన్ లేదా చుక్కల మందునే మనం ఇన్నాళ్లూ చూశాం. అయితే ఇప్పుడది ఒక కొత్త పద్ధతిలో రానుందని ఇటీవల అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక అధ్యయనం అంచనా వేస్తున్నది. దారంలాంటి దాన్ని ఉపయోగించి పళ్ల మధ్యలో ఉండే పాచిని, పళ్ల సందుల్ని శుభ్రం చేసే విధానాన్ని ఫ్లాసింగ్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు ఇదే విధానం ద్వారా నోరు, ముక్కు, ఊపిరితిత్తులకు సంబంధించిన వివిధ వ్యాధులు రాకుండా ఉండేలా వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయట.
జంతువుల మీద చేసిన ప్రయోగంలో ఇలా డెంటల్ ఫ్లాస్ ద్వారా టీకా ఇస్తే ఇంజెక్షన్‌తో పోలిస్తే ఎక్కువ ఉపయోగం ఉన్నట్టుగా నిర్థారణ జరిగింది. అంటే చాలా రకాల వ్యాధుల వ్యాప్తికి ముఖ్యంగా నోరు, ముక్కులే మార్గాలుగా ఉంటాయి కనుక అక్కడ యాంటి బాడీలను ఉత్పత్తి చేసేందుకు ఈ విధానం పనికి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇన్‌ఫ్లూయెంజా, కొవిడ్‌లాంటి వ్యాధులను అరికట్టేందుకు ఇది ఉపయోగపడనున్నదట. ఈ పద్ధతిలో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల అది పళ్ల మధ్యలో ఉండే జంక్షనల్ ఎపిథెలియం అనే కణ జాలాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా ముక్కు, నోరు, ఊపిరితిత్తుల ఉపరితలం మీద వ్యాధి నిరోధక యాంటి బాడీల ఉత్పత్తి అధికం అవుతుంది. ఇంజెక్షన్ ద్వారా వ్యాక్సిన్ ఇచ్చినప్పటికంటే ఈ విధానంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పడే యాంటి బాడీలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి మునుముందు నోరు ముక్కుల ద్వారా శరీరంలోకి వెళ్లే వ్యాధికారక క్రిములను అడ్డుకట్టవేసేందుకు ఈ డెంటల్ ఫ్లాసింగ్ ద్వారా వ్యాక్సిన్ ఇవ్వనున్నారన్న మాట!