చంకల్లో మరీ ఎక్కువగా చెమటపట్టడం అనారోగ్య సంకేతం. దీన్ని ‘హైపర్ హైడ్రోసిస్’ అంటారు. ఈ సమస్య ఎవరికైనా రావచ్చు. హైపర్ హైడ్రోసిస్‌కు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే, సొంత వైద్యం పనికిరాదు. కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు.
ప్రిస్క్రిప్షన్ స్ట్రెంత్ యాంటీ పెర్స్పిరెంట్స్
మామూలు డియోడరెంట్ల్లు పనిచేయకపోతే చంకల్లో మితిమీరిన చెమటను నివారించేందుకు యాంటీ పెర్స్పిరెంట్స్ సిఫారసు చేస్తారు డాక్టర్లు. వీటిలో అల్యూమినియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్ లాంటివి అత్యధిక గాఢతతో ఉంటాయి కాబట్టి, నిపుణుల సలహా మేరకే తగిన మోతాదులో వాడాలి.
టాపికల్ యాంటీపెర్స్పిరెంట్స్
వీటిలోని అల్యూమినియం క్లోరైడ్ స్వేద గ్రంథుల్ని మూసేస్తుంది. అలా చెమట వెలువడటాన్ని తగ్గిస్తుంది. పడుకునే ముందు చంకల్లో పొడిచర్మం మీద పూతగా రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
బొటాక్స్ ఇంజెక్షన్స్
బొట్యులినమ్ టాక్సిన్ను కలిగిన బొటాక్స్ ఇంజెక్షన్స్ సమర్థమైన చికిత్స అందిస్తాయి. ఈ టాక్సిన్ చంకల్లో చెమటను ప్రేరేపించే రసాయన సంకేతాల్ని అడ్డుకుంటుంది. ఆ ప్రభావం కొన్ని నెలలు ఉంటుంది. కానీ, ఈ ప్రక్రియ మొత్తం వైద్యుడి పర్యవేక్షణలో జరగాలి.
అయాన్టోఫోర్సిస్
ఇందులో భాగంగా నీళ్ల ద్వారా కానీ, తడి ప్యాడ్‌ను చంకల్లో ఉంచి కానీ ఓ మోస్తరు విద్యుత్తు పంపిస్తారు. దీంతో స్వేద గ్రంథులు తాత్కాలికంగా పూడుకుపోతాయి. అలా అధికచెమట నుంచి విముక్తి లభిస్తుంది. నిపుణుల పర్యవేక్షణలోనే ఈ వైద్యం చేయించుకోవాలి.
లేజర్ చికిత్స
లేజర్ అబ్లేషన్, లేజర్ లైపోలైసిస్ చంకల్లో చెమటను నియంత్రించే విధానం. చంకల్లో స్వేద గ్రంథులు లక్ష్యంగా చికిత్స చేస్తారు. దాంతో చెమట తగ్గిపోతుంది. లేజర్ థెరపీతో చర్మంపై కోత తక్కువగా ఉంటుంది. అదే సమయంలో సమస్యకు వేగవంతమైన పరిష్కారం దొరుకుతుంది.
సర్జరీ
ప్రత్యేక పరిస్థితుల్లో వైద్యులు సర్జరీని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటివాటిలో ఆగ్జిలరీ స్వెట్ గ్లాండ్ సక్షన్ క్యూరెటేజ్ ఒకటి. దీనిద్వారా చంకల్లో స్వేద గ్రంథుల్ని పూర్తిగా తొలగిస్తారు. మరో చికిత్స పేరు.. థొరాసిక్ సింపథెక్టమీ. ఇందులో చెమట ఉత్పత్తికి మూలమైన నరాలను కత్తిరిస్తారు లేదా ముడివేస్తారు. అయితే, సర్జరీని చివరి అస్త్రంగా మాత్రమే ఎంచుకోవాలి. అదీ ప్లాస్టిక్ సర్జరీ నిపుణుడిని సంప్రదించిన తర్వాతే.