డాక్టర్ గారూ నమస్తే. మా బాబు వయసు ఏడేండ్లు. నిద్ర లేవగానే తుమ్ముల మీద తుమ్ములు వచ్చేస్తాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. డాక్టర్లకు చూపించాం. సిరప్లు ఇచ్చారు. మందు వేసినప్పుడు తీవ్రత తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మామూలే. ఇదేమైనా తీవ్ర సమస్యా?
మీరు చెప్పే లక్షణాలను బట్టి చూస్తే మీ బిడ్డకు అలర్జీ క్రైనటిస్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఏదైనా అలర్జీ కలిగించే పదార్థం చుట్టుపక్కల ఉన్నట్టు అయితే, దాని ద్వారా ముక్కు, గొంతు, కళ్లు ప్రభావితం అవుతాయి. దీంతో ముక్కులో నీళ్లు కారుతాయి. కళ్లు ఎర్రబడతాయి. శ్వాస వ్యవస్థ తక్షణం ప్రభావితం కావడంతో తుమ్ములు వచ్చేస్తాయి. పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి, బూజు, బొద్దింకల విసర్జితాలు, పేడ.. మొదలైనవి అలర్జీ కలిగిస్తాయి. మండుతున్న నూనె, ఘాటైన అత్తర్లు, ధూమపానం పొగ తదితర ఘాటు వాసనలు కూడా కొందరిని ఇబ్బంది పెడతాయి. మీ బాబును ప్రభావితం చేస్తున్న అంశాలు ఏమిటో చెప్పలేదు.
సమస్య మూలాలను గుర్తించి.. అలర్జీ కలిగించే వస్తువులు, పదార్థాల నుంచి తనను దూరంగా ఉంచండి. వంశపారంపర్యంగా కూడా ఇలా జరగవచ్చు. ఆస్తమా లక్షణాలు అయినా కావచ్చు. ఇలాంటి సమయాల్లో ముక్కులోని కణజాలాలు ఉబ్బిపోతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనానికి వైద్యులు స్ప్రే సిఫారసు చేస్తారు. కాబట్టి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే నిపుణుల పర్యవేక్షణలో చికిత్స చేయించండి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్