వర్ష్షకాలం అందరూ సూప్ ఇష్టపడతారు. జలుబు చేసినా, గొంతు గరగరగా ఉన్నా ఆ వేడివేడి పానీయమే గుర్తుకొస్తుంది. సూప్ వల్ల శరీరానికి కలిగే లాభాలేమిటి?
సూప్ ఆరోగ్యకరమైంది. ఎందుకంటే, దీన్ని ఉడికించి చేస్తాం. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు వాడతాం. విటమిన్స్, మినరల్స్, పీచులు, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. సూప్ వల్ల జీర్ణరసాలు బాగా ఊరతాయి. అలా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మల బద్ధకం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ లాంటి సమస్యలు ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. సూప్ తాగితే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. దానివల్ల మితంగా తింటాం. కాబట్టి, బరువు తగ్గడానికీ పనికొస్తుంది.
జ్వరంగా ఉన్నప్పుడు తీసుకున్నా మంచిదే. అందులోనూ ఆ సమయంలో శరీరానికి ద్రవాల అవసరం అధికంగా ఉంటుంది. గ్లాసులకొద్దీ నీళ్లు తాగాలంటే కష్టం కాబట్టి సూప్ రూపంలోనూ తీసుకోవచ్చు. జలుబు, జ్వరం ఉన్నప్పుడు కొంచెం అల్లం కలిపి తీసుకుంటే, గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం దొరుకుతుంది. సూప్ చేసేప్పుడు కార్న్‌ఫ్లోర్ కలుపుతారు. ఇది ప్రాసెస్డ్ ఫుడ్. కార్న్‌ఫ్లోర్ లేకుండా చేస్తే మంచిది. కూరగాయలు ఉడికించేప్పుడే కాస్త పెసరపప్పు జోడిస్తే సూప్ చిక్కబడుతుంది. రాగిపిండి కలిపినా మంచిదే. నాన్ వెజిటేరియన్స్ ఇష్టపడే పాయ, బోన్ సూప్ ఎముకలకు మంచిది.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@ gmail.com