Visceral Fat | శరీర బరువు సాధారణంగా ఉండటం ఆరోగ్యానికి సూచికగా భావించడం ఇప్పటివరకు సాధారణంగా ఉన్న అభిప్రాయం. అయితే ప్రస్తుత కాలంలో బరువు సాధారణంగా ఉన్నప్పటికీ, అనేక మంది మెటాబాలిక్ సమస్యలు, ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో కనిపించని అంతర్గత కొవ్వు (విస్సెరల్ ఫ్యాట్) పెరగడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విస్సెరల్ ఫ్యాట్ పొట్ట భాగంలో ఉండి కాలేయం, ప్యాంక్రియాస్, కిడ్నీల వంటి ముఖ్య అవయవాల చుట్టూ చేరుతుంది. ఇది సాధారణ కొవ్వు కాదు, ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు)ను పెంచే రసాయనాలను విడుదల చేస్తుంది. దీనివల్ల అవయవాల పనితీరు దెబ్బతింటుంది. బయటకు సన్నగా కనిపించే వారిలో కూడా ఈ సమస్య ఉండటం వల్ల దీనిని థిన్-ఫ్యాట్ ఫెనోటైప్ గా పిలుస్తున్నారు. విస్సెరల్ ఫ్యాట్ పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్, హై బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలు వస్తాయి. ఇవి క్రమంగా కిడ్నీల్లోని చిన్న ఫిల్టర్లను దెబ్బతీసి, చివరికి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి దారితీస్తాయి.
ముఖ్యంగా ఈ మార్పులు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా కొనసాగడం వల్ల సమస్య మరింత ప్రమాదకరంగా మారుతోంది. దక్షిణాసియా ప్రజల్లో, ముఖ్యంగా భారతీయుల్లో, ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. జన్యుపరమైన లక్షణాల వల్ల తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్నప్పటికీ, అంతర్గత కొవ్వు ఎక్కువగా నిల్వ అవుతుంది. అందుకే ఆసియా ప్రజల కోసం BMI ప్రమాణాలు కూడా వేరుగా ఉంటాయి. 18.5-22.9 మధ్య BMI సాధారణంగా పరిగణించబడితే, 23 పైగా ఉంటేనే ప్రమాద సూచనలు ప్రారంభమవుతాయి. అలాగే చాలా మంది తీసుకునే అసమతుల్య ఆహారం కూడా దీనికి ప్రధాన కారణంగా మారుతోంది. అధికంగా రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు తీసుకోవడం, ప్రోటీన్ తక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీర నిర్మాణం దెబ్బతింటుంది. ముఖ్యంగా యువతలో కండరాల మాస్ తగ్గిపోవడం వల్ల మెటాబాలిజం బలహీనమై, అంతర్గత కొవ్వు పెరుగుతుంది.
కేవలం BMI ఆధారంగా ఆరోగ్యాన్ని అంచనా వేయడం సరిపోదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నడుము కొలత, నడుము-ఎత్తు నిష్పత్తి, బాడీ కంపోజిషన్ వంటి పరీక్షలు విస్సెరల్ ఫ్యాట్‌ను గుర్తించడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటు, బ్లడ్ షుగర్, కిడ్నీ ఫంక్షన్ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం అవసరం. కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో చాలా సూక్ష్మ సంకేతాల రూపంలో కనిపిస్తాయి. రక్తంలో క్రియాటినిన్ స్థాయులు కొద్దిగా పెరగడం, మూత్రంలో స్వల్పంగా ప్రోటీన్ కనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి కిడ్నీ ఆరోగ్యాన్ని హెచ్చరించే సంకేతాలని వైద్యులు చెబుతున్నారు.
విస్సెరల్ ఫ్యాట్ తగ్గించడానికి బరువు తగ్గడం కంటే జీవనశైలి మార్పులు చేయడం ముఖ్యమని, రెగ్యులర్ వ్యాయామం, ముఖ్యంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం ద్వారా కండరాల పెరుగుదలతో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుందని, సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరమని వైద్యులు తెలియజేస్తున్నారు. తృణ ధాన్యాలు, ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అదే సమయంలో ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఉప్పు, చక్కెరలను తగ్గించడం కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నీటిని ఎక్కువగా తాగడం, తగిన నిద్ర, ఒత్తిడి నియంత్రణ కూడా మెటాబాలిక్ ఆరోగ్యానికి కీలకం. ఇవి శరీర సమతుల్యతను కాపాడి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయి. సన్నగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం అనే భావనను ఈ పరిస్థితి సవాలు చేస్తోంది. ఆరోగ్యం అనేది కేవలం బరువుతో కాదు, శరీర నిర్మాణం, జీవనశైలితో సంబంధం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి కనిపించని అంతర్గత కొవ్వు ప్రమాదాన్ని గుర్తించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులను నివారించడం సాధ్యమవుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.