పండ్లు బాగా ఉన్నాసరే ఏడాదికోసారి దంత పరీక్ష తప్పనిసరి. దీంతో నోట్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగానే తెలుసుకోవచ్చు. సమస్య ముదరకుండా చూసుకోవచ్చు. రూట్ కెనాల్, పన్ను పీకించుకోవడం లాంటి బాధలను తప్పించుకోవచ్చు. సమస్య ఏదైనా చికిత్స కంటే నివారణే మంచిదని తెలిసిన విషయమే!
తిన్న తర్వాత బ్రష్ చేసినా కూడా పండ్ల మీద, వాటి మధ్య పాచి, గార పేరుకుపోతాయి. దంత వైద్యుడి దగ్గరికి వెళ్తే పరీక్షలో భాగంగా ఆయన మీ పండ్లను శుభ్రం చేస్తాడు. వాటికి మెరుగుపెడతాడు. అలా మీ దంతాలకు ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటాడు. క్యావిటీలు రాకుండా నివారిస్తాడు.
పాచి, గారను తొలగించకపోతే చిగుళ్ల ఇన్ఫెక్షన్లు బాధిస్తాయి. చిగుళ్ల దగ్గర పేరుకునే గార చిగుళ్లను, పంటిని వేరుచేస్తుంది. ఇన్ఫెక్షన్ తీవ్రమైతే చిగురు, పంటిని పట్టి ఉంచే కణజాలం క్షీణించడం మొదలవుతుంది. వాస్తవంగా చిగుళ్ల వ్యాధి అంటే ఇదే. ఈ దశలో చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాపులాంటివి కనిపిస్తాయి. పండ్లు వదులుకావడం, ఊడిపోవడం సహజంగానే జరిగిపోతుంటాయి. ఈ దశలో
అడ్వాన్స్డ్ చికిత్స అవసరమవుతుంది.
దంత వైద్యుడి దగ్గరికి వెళ్లినప్పుడు మీ పంటిని, దవడ ఎముకను ఎక్స్రే తీస్తాడు. దీని సాయంతో చిగుళ్లు, దవడలో ఏ సమస్య ఉందో చూస్తాడు. తగిన పరిష్కారం సూచిస్తాడు.
మీ నవ్వులు బలంగా, మాటలు స్పష్టంగా ఉండేందుకు ఏడాదికోసారైనా దంత పరీక్ష చేయించుకోండి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.