Estrogen | మహిళల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో హార్మోన్లు అత్యంత కీలకమైనవి. శరీరంలోని వివిధ గ్రంథులు ఉత్పత్తి చేసే ఈ రసాయన దూతలు జీవక్రియలు, మానసిక స్థితి, రుతుక్రమం, గర్భధారణ, ఎముకల బలం, గుండె ఆరోగ్యం వంటి అనేక శారీరక ప్రక్రియలను నియంత్రిస్తాయి. జీవితంలోని వివిధ దశల్లో హార్మోన్ల స్థాయిల్లో వచ్చే మార్పులు మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. మహిళల ఆరోగ్యాన్ని ప్రధానంగా ప్రభావితం చేసే హార్మోన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్. వీటిని చాలామంది కేవలం సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్లుగా భావించినప్పటికీ, ఇవి శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తాయి.
ఈస్ట్రోజెన్ ప్రధానంగా అండాశయాల్లో ఉత్పత్తి అవుతుంది. ఇది రుతుచక్రాన్ని నియంత్రించడంతోపాటు గర్భధారణకు అవసరమైన శరీర మార్పుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఎముకల బలం, మెదడు పనితీరు, గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. యుక్తవయస్సు, గర్భధారణ, మెనోపాజ్ వంటి దశల్లో ఈస్ట్రోజెన్ స్థాయిల్లో మార్పులు రావడం వల్ల శారీరక, భావోద్వేగ మార్పులు సహజంగా కనిపిస్తాయి. ప్రొజెస్టెరాన్ హార్మోన్ గర్భధారణకు శరీరాన్ని సిద్ధం చేయడంతోపాటు గర్భాన్ని కొనసాగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అండోత్సర్గం తర్వాత దీని స్థాయిలు పెరుగుతాయి. రుతుక్రమాన్ని క్రమబద్ధీకరించడంలో, మానసిక స్థితిని ప్రభావితం చేయడంలో ఇది కీలకంగా ఉంటుంది. ఈ హార్మోన్ తక్కువగా ఉంటే నెలసరి సక్రమంగా రాకపోవడం, మూడ్ స్వింగ్స్, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. టెస్టోస్టెరాన్ను సాధారణంగా పురుషుల హార్మోన్‌గా భావించినప్పటికీ, మహిళల శరీరంలో కూడా ఇది స్వల్ప మోతాదులో ఉత్పత్తి అవుతుంది. కండరాల బలం, ఎముకల సాంద్రత, లైంగిక ఆసక్తిని కొనసాగించడంలో ఇది సహాయపడుతుంది.
మహిళల్లో రుతుచక్రం కూడా హార్మోన్ల సమన్వయంతోనే కొనసాగుతుంది. రుతుచక్రం ప్రారంభ దశలో ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH) అండాన్ని పరిపక్వం చేస్తుంది. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ పెరిగి గర్భాశయ పొరను మందంగా తయారుచేస్తుంది. అండోత్సర్గం సమయంలో ల్యూటినైజింగ్ హార్మోన్ (LH) ఒక్కసారిగా పెరగడంతో పరిపక్వమైన అండం విడుదల అవుతుంది. అనంతరం ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరిగి గర్భధారణకు శరీరాన్ని సిద్ధం చేస్తాయి. గర్భం దాల్చకపోతే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు తగ్గిపోవడంతో రుతుస్రావం ప్రారంభమవుతుంది. గర్భధారణ సమయంలో హెచ్‌సీజీ (hCG), ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇవి గర్భంలోని శిశువు ఎదుగుదలకు తోడ్పడతాయి. అలాగే రిలాక్సిన్ అనే హార్మోన్ ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేయడానికి పెల్విక్ కండరాలు, లిగమెంట్లను సడలిస్తుంది. సాధారణంగా 51 నుంచి 52 ఏళ్ల మధ్య మెనోపాజ్ ప్రారంభమవుతుంది. ఈ దశలో అండాశయాలు అండాలను విడుదల చేయడం క్రమంగా ఆపేస్తాయి. ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిపోవడంతో హాట్ ఫ్లాషెస్, రాత్రిపూట చెమటలు పట్టడం, నిద్రలేమి, యోని పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
హార్మోన్ల అసమతుల్యత కారణంగా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), ఎండోమెట్రియోసిస్, థైరాయిడ్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి వల్ల నెలసరి అవకతవకలు, బరువు పెరగడం, మానసిక ఒత్తిడి, గర్భధారణలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళల జీవనశైలి కూడా హార్మోన్ల సమతుల్యతపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారం, తగిన నిద్ర హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి, బి-కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణకు అవసరం. అలాగే దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కార్టిసోల్ హార్మోన్ స్థాయిలు పెరిగి పునరుత్పత్తి హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల యోగా, ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ వంటి పద్ధతులను అలవాటు చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతోపాటు హార్మోన్ల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.