Essential Tremor | చేతిలో వస్తువులు పట్టుకున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు చేతులు అదుపు తప్పినట్లు వణుకుతున్నాయా? ఫోన్లో టైప్ చేయడం, కాఫీ కప్పును పట్టుకోవడం, రాయడం వంటి సాధారణ పనులు కూడా ఇబ్బందిగా మారుతున్నాయా? దీనిని చాలామంది ఒత్తిడి, ఆందోళన లేదా వయసు పెరగడం వల్ల వచ్చే సహజ సమస్యగా భావిస్తుంటారు. కానీ తరచూ ఇలా జరుగుతుంటే అది ఎసెన్షియల్ ట్రెమర్ అనే నాడీ సంబంధిత పరిస్థితికి సంకేతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎసెన్షియల్ ట్రెమర్ అంటే శరీరంలోని ఒక భాగం అనియంత్రితంగా, లయబద్ధంగా వణికే నాడీ సంబంధిత సమస్య. ఇది తల, శరీరం, గొంతు వంటి భాగాలను కూడా ప్రభావితం చేయగలిగినప్పటికీ, ఎక్కువగా చేతులు, ముంజేతుల్లో కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధితో పోలిస్తే ఇది ఎక్కువగా కనిపించే పరిస్థితి అయినప్పటికీ, దీని గురించి చాలామందికి అవగాహన లేదు.
ఎసెన్షియల్ ట్రెమర్ను గుర్తించడంలో ముఖ్యమైన అంశం వణుకు ఎప్పుడు వస్తుందనేదే. పార్కిన్సన్స్ వ్యాధిలో సాధారణంగా చేతులు విశ్రాంతిలో ఉన్నప్పుడు వణుకుతాయి. అయితే ఎసెన్షియల్ ట్రెమర్లో చేతులతో పని చేస్తున్నప్పుడు వణుకు ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు నీళ్ల గ్లాసు అందుకోవడం, టైప్ చేయడం, షూలేస్ కట్టుకోవడం వంటి పనులు చేస్తున్నప్పుడు చేతులు వణకుతాయి. ఇది మొదట ఒక చేతిలో ప్రారంభమైనప్పటికీ, క్రమంగా రెండు చేతులనూ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎసెన్షియల్ ట్రెమర్ వేళ్లలో స్వల్ప వణుకుతో మొదలై, సంవత్సరాల వ్యవధిలో నెమ్మదిగా పెరుగుతుంది. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చేతులు స్వల్పంగా వణకడం, అప్పుడప్పుడు తల అనియంత్రితంగా ఊగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. శరీర పరిస్థితులు, జీవనశైలి కూడా ఈ వణుకును మరింత పెంచుతాయి.
ఒత్తిడి, ఆందోళన, అలసట, నిద్రలేమి, కెఫీన్ లేదా ఇతర ఉద్దీపక పదార్థాల వినియోగం, తీవ్రమైన వేడి లేదా చలి వంటివి ఎసెన్షియల్ ట్రెమర్ను ఎక్కువగా కనిపించేలా చేస్తాయి. ఎసెన్షియల్ ట్రెమర్కు అసలు కారణం ఏంటన్నది ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా తెలియదు. అయితే మెదడులోని కదలికలను సమన్వయం చేసే సెరెబెల్లమ్ ప్రాంతంలోని నాడీ సంకేతాల్లో ఏర్పడే అంతరాయం దీనికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఈ నాడీ మార్గాల్లో విద్యుత్ సంకేతాలు సక్రమంగా పనిచేయకపోతే పునరావృతమయ్యే లయబద్ధమైన వణుకు ఏర్పడుతుంది. ఈ సమస్యలో జన్యుపరమైన ప్రభావం కూడా ముఖ్యమైనదిగా చెబుతున్నారు. సుమారు సగం కేసులు కుటుంబాల్లో కనిపిస్తాయి. అందుకే దీనిని ఫ్యామిలియల్ ట్రెమర్ అని కూడా పిలుస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరికి దీనికి సంబంధించిన జన్యు ప్రభావం ఉంటే, పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకే కుటుంబంలో ఉన్నవారిలో కూడా ఈ సమస్య మొదలయ్యే వయసు, లక్షణాల తీవ్రత వేర్వేరుగా ఉంటాయి.
ఎసెన్షియల్ ట్రెమర్ను నిర్ధారించేందుకు ప్రత్యేకమైన రక్త పరీక్ష లేదా మెదడు స్కాన్ ఉండదు. వైద్యులు వ్యక్తి కదలికలను పరిశీలించడం, కుటుంబ ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం, అవసరమైన సాధారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా ఇతర కారణాలను తొలగిస్తారు. థైరాయిడ్ సమస్యలు లేదా కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల వణుకు వస్తుందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తారు. తేలికపాటి ఎసెన్షియల్ ట్రెమర్ ఉన్న ప్రతి ఒక్కరికీ తీవ్రమైన వైద్య చికిత్స అవసరం ఉండదు. పరిస్థితిని బట్టి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం, అవసరమైతే మందులు ఉపయోగించడం ద్వారా వణుకును నియంత్రించవచ్చు. బీటా-బ్లాకర్స్ వంటి మందులు వణుకు తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఇవి సమస్యను పూర్తిగా నయం చేయవు.
మందులతో కూడా వణుకు అదుపులోకి రాని తీవ్రమైన సందర్భాల్లో ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. బొటులినమ్ టాక్సిన్ ఇంజెక్షన్లు, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS), ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వంటి చికిత్సలను పరిస్థితిని బట్టి వైద్యులు సూచిస్తారు. ఫోకస్డ్ అల్ట్రాసౌండ్లో మెదడులో వణుకుకు కారణమయ్యే నిర్దిష్ట ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ధ్వని తరంగాలను ఉపయోగిస్తారు. ఎసెన్షియల్ ట్రెమర్ ప్రాణాంతకమైన పరిస్థితి కాదు. సరైన సమయంలో సమస్యను గుర్తించి, అవసరమైన చికిత్స తీసుకోవడంతో పాటు రోజువారీ పనుల్లో తగిన మార్పులు చేసుకుంటే చాలామంది సాధారణ జీవనాన్ని కొనసాగిస్తారు. చేతుల్లో తరచూ లేదా నిరంతరం వణుకు కనిపిస్తుంటే, దానిని కేవలం నరాల బలహీనతగా లేదా ఆందోళనగా భావించకుండా వైద్యుడిని సంప్రదించి కారణాన్ని తెలుసుకోవడం మంచిది.