Edema Home Remedies | నేటి తరుణంలో చాలా మంది పాటిస్తున్న అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో కొవ్వు అధికంగా చేరి బరువు పెరుగుతున్నారు. దీంతో డయాబెటిస్, గుండె జబ్బులు వస్తున్నాయి. అయితే చాలా మందికి కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాప కింద నీరులా విస్తరిస్తోంది. కిడ్నీలు ఫెయిల్ అయ్యేందుకు అనేక కారణాలు ఉంటాయి. డయాబెటిస్ ఉండడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలంగా ఉండడం, శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోవడం, ఉప్పు అధికంగా తినడం, నీరు ఎక్కువగా చేరడం వంటి అనేక కారణాల వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతుంటాయి. అయితే శరీరంలో నీరు చేరితే మనకు సులభంగా తెలిసిపోతుంది. దీన్నుంచి బయట పడడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
శరీరంలో అధికంగా నీరు చేరినప్పుడు శరీరంలోని పలు భాగాలు వాపులకు గురవుతాయి. దీన్నే వైద్య పరిభాషలో ఎడిమా అంటారు. ఇలాంటి స్థితి వస్తే పాదాలు, అర చేతులు వాపులకు గురై కనిపిస్తాయి. ముఖ్యంగా పాదాల మడమలపై వేలితో టచ్ చేస్తే అక్కడి చర్మం గుంతలా పడి లోపలికి వెళ్తుంది. దీన్ని బట్టి శరీరంలో నీరు అధికంగా చేరిందని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమస్య గనక ఎవరికైనా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకండి. వెంటనే డాక్టర్ను కలిసి చికిత్స తీసుకోవాలి. లేదంటే దీర్ఘకాలంలో కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఈ సమస్యకు వైద్యులు ఇచ్చే మందులను వాడడంతోపాటు పలు ఇంటి చిట్కాలు కూడా పనిచేస్తాయి. వాటిని పాటించడం ద్వారా శరీరంలో అధికంగా చేరిన నీటిని బయటకు పంపించవచ్చు.
పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. దీంతో నీరు బయటకు పోతుంది. ముఖ్యంగా అరటి పండ్లు, బొప్పాయి, ద్రాక్ష, యాప్రికాట్స్ వంటి పండ్లతోపాటు బీట్ రూట్, అవకాడో, క్యాప్సికం, నిమ్మ, టమాటా వంటి కూరగాయలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు పోతుంది. మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. మెగ్నిషియం మనకు ఎక్కువగా నట్స్, విత్తనాలు, తృణ ధాన్యాలు, మిల్లెట్లు, ఆకుపచ్చని కూరగాయల్లో లభిస్తుంది. వీటిని రోజూ తింటున్నా ఫలితం ఉంటుంది.
గ్రీన్ టీ, మందార పువ్వుల టీ, కమోమిల్ టీ వంటి హెర్బల్ టీలను సేవిస్తుండాలి. ఈ టీలలో యాంటీ ఆక్సిడెంట్లు, బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతాయి. దీంతో అధికంగా ఉండే నీరు కూడా బయటకు పోతుంది. రాత్రి పూట నిద్రించేటప్పుడు పాదాలు కాస్త ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల పాదాల్లో నీరు చేరదు. అలాగే రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లను తాగాల్సి ఉంటుంది. నీళ్లకు నీళ్లతోనే సమాధానం చెప్పాలి. శరీరీంలో అధికంగా ఉన్న నీరు బయటకు పోవాలంటే మనం కూడా బయటి నుంచి శరీరానికి ఎక్కువ నీళ్లను అందించాలి. దీని వల్ల శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. అలాగే రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీని వల్ల కూడా శరీరంలో అధికంగా ఉండే నీటిని బయటకు పంపించవచ్చు. ఇలా కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్య తగ్గుతుంది. కిడ్నీలు ఫెయిల్ అవకుండా ఉంటాయి.