ఇప్పటి వరకూ రకరకాల డైట్ ప్లాన్స్ గురించి వినే ఉంటారు. ఒకటో రెండో అనుసరించే ఉంటారు. కానీ, ఇది మాత్రం భిన్నమైంది. ఒ.ఎమ్.ఎ.డి – వన్ మీల్ ఎ డే! రోజుకు ఒకసారి మాత్రమే తినాలి. మిగతా సమయమంతా పొట్ట ఖాళీగా ఉంచుకోవాలి.
గంట గంటకు కడుపులో ఏదో ఒకటి తోసేసుకోవడం అలవాటే మనకు. కానీ ఇక్కడ మాత్రం అలా కుదరదు. రోజుకు ఒకసారి మాత్రమే తినాలి. మళ్లీ రేపటి వరకు బంద్. ఇదీ నియమం. సగటు మనిషి రోజుకు 2,500 కేలరీలు తీసుకుంటాడు. అయితే.. ఆ కేలరీలన్నీ ఖర్చు చేస్తున్నామా లేదా అన్నది మాత్రం
పట్టించుకోడు.
ఈ డైట్ ప్రకారం రోజుకు ఒకసారే తింటాం కాబట్టి, రేపు ఈ సమయానికి కేలరీలన్నీ ఖర్చయిపోవడం ఖాయం. దీంతో అధిక బరువు సమస్య ఉండదు. అయితే ఈ డైట్ ప్లాన్ కొందరికి పడటం లేదు. తల తిరగడం, అలసట, వికారం వంటి దుష్ఫలితాలు కనిపించాయి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఓ నాలుగు ముద్దలు ఎక్కువే తినేస్తాం. ఇది రక్తంలోని చక్కెర స్థాయి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే, రోజుకు ఒకసారి మాత్రమే భోంచేసి మిగతా సమయాల్లో పండ్లు, ఇతర పోషకాలు తీసుకుంటే మాత్రం ఎలాంటి సమస్యా ఉండదు. కొన్ని పరిమితులున్నా.. స్థూలకాయులకు ఇది తిరుగులేని డైట్ ప్లాన్. కాకపోతే నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి.