న్యూఢిల్లీ : మనం తీసుకునే ఆహార పదార్ధాలపై నియంత్రణ సాధించడం ద్వారా కొవ్వును సులభంగా కరిగించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు కొందరు జిమ్ల్లో కొవ్వు కరిగేలా ఎక్సర్సైజులు చేస్తూ చెమట చిందిస్తే మరికొందరు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానేయడం ద్వారా ఆశించిన ఫలితాలు రాబడుతుంటారు. వీటితో పాటు ఆహార నియమాల్లో మార్పుల తోనూ పొట్ట తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకుంటే తీరైన శరీరాకృతితో పాటు మెరుగైన ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. తక్కువ మోతాదులో తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా పొట్ట తగ్గించుకోవచ్చు. ఇక కార్బోహైడ్రేట్ల స్దానంలో ప్రొటీన్లను అధికంగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, రిఫైన్డ్ చక్కెరలను తగ్గించి వాటి స్ధానంలో ప్రొటీన్లను తీసుకుంటే కండర పుష్టితో పాటు ఆకలి తగ్గి తరచూ ఆహారం తీసుకోవడం తగ్గిస్తారు.
ఇక పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో ఉండే సూక్ష్మపోషకాలు శరీర బరువును అదుపులో ఉంచేందుకు తోడ్పడతాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ బరువును నియంత్రించడంతో పాటు శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఇక సోడాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. వీటిలో ఉండే రిఫైన్డ్ చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లు కొద్దిసమయంలోనే పొట్ట పెరిగేందుకు దారితీస్తాయి. వీటిస్ధానంలో నీరు, హెర్బల్ టీ తాగడం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ బారినపడకుండా కాపాడటంతో పాటు బరువు పెరగడాన్ని నిరోధిస్తాయి.