హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఆలయాల ధూప దీపాలకు నిధులు కరువయ్యాయి. ప్రతిసారీ ఏదో ఒక సాకుతో కొన్ని ధూప దీప నైవేద్యం పథకం (డీడీఎన్) ఆలయాలకు నెలవారీ డబ్బులు అందడం లేదు. ఈ నెల సుమారు 1,100 ఆలయాల ఖాతాల్లో డబ్బులు జమకాలేదని సమాచారం. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ధూప దీప నైవేద్య పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అర్హత కలిగిన ఆలయాలకు ఆర్థిక సాయం అందిస్తున్నది. ఆదాయం లేని ఆలయాల నిర్వహణ, సంప్రదాయ పూజల కోసం డీడీఎన్ పథకం కింద నిధులు కేటాయిస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,790 దేవాలయాలు డీడీఎన్ పథకంలో ఉన్నాయి. ఇందులో ఇటీవల ఎంపికైన 250 ఆలయాలతోపాటు రెండేండ్ల క్రితం ఎంపికైన దాదాపు 910 ఆలయాలు కలిపి మొత్తం 1,160 దేవాలయాలకు అక్టోబర్లో నిధులు జమ కాలేదు. తాము ప్రతిపాదనలు పంపించామని, బడ్జెట్ లేకపోవడం వల్లే ఆలస్యమవుతున్నదని దేవాదాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఇటీవల కాలంలో ఆలయాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి సకాలంలో నిధులు విడుదల చేసి ఆలయాల నిర్వహణ సక్రమంగా జరిగేలా తోడ్పాటును అందించాలని డీడీఎన్ అర్చకులు కోరుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతినెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేయడంతో ఈ పథకం నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు కలుగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిధుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల క్రితం కూడా బడ్జెట్ ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఆలస్యంగా నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి నెలకొనడంతో అర్చకుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉంటే పథకంలో ఉన్న అన్ని దేవాలయాలకు నిధులను ఒకేసారి కాకుండా విడతలవారీగా విడుదల చేస్తున్నారని ఆ శాఖ అధికారులే విమర్శిస్తున్నారు. కొన్ని ఆలయాలకు ఇచ్చి మరికొన్ని దేవాలయాలకు ఆలస్యంగా ఇస్తుండటంతో ఆయా ఆలయాల నిర్వహణ సమస్యాత్మకంగా మారుతున్నది.