హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) టీచింగ్ అసోసియేట్, పార్ట్ టైమ్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఐదు ఖాళీలు భర్తీ చేయనున్నట్టు యాజమాన్యం వెల్లడించింది. టీచింగ్ అసోసియేట్ పోస్టుల్లో సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, పార్ట్ టైం టీచర్ పోస్టుల్లో అగ్రానమి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, వెటర్నరీ-లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ పోస్టులను ఒకటి చొప్పున భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంఎస్సీ లేదా పీహెచ్డీ, ఎంవీఎస్సీ విద్యార్హతగా నిర్ణయించారు. ఈ నెల 12న నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ pjtau.edu.inను పరిశీలించాలని యాజమాన్యం సూచించింది.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, సాంకేతిక విద్యలో పరిశోధన, బోధన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్రం అమలు చేస్తున్న మెరిట్ (మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్) పథకం అమలుకు రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా సాంకేతిక విద్యలో మల్టీ డిసిప్లినరీ సంస్కరణలకు పెద్దపీట వేస్తారు. కేంద్ర విద్యాశాఖ 2026 జూలై 29న జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో పథకం సమర్ధవంతంగా అమలు చేసేందుకు 9-10 మంది సభ్యులతో స్టేట్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. సాంకేతిక విద్య కార్యదర్శి, సిల్ డెవలప్మెంట్ సెక్రటరీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ విభాగం అధికారి, సాంకేతిక విద్య స్టేట్ కో-ఆర్డినేటర్, ఉన్నత విద్య డైరెక్టర్, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, ఇంజినీరింగ్ విద్యలో నిష్ణాతులు ఇందులో సభ్యులుగా ఉంటారు.