మెదక్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ)/రామాయంపేట : యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి మంచి భవిష్యత్ కోసం ఉన్నత విద్యను అభ్యసించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, దాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని సూచించారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ కలెక్టరేట్లో ‘నషా ముక్త్ భారత్’ ర్యాలీ ప్రారంభించారు. మహిళా శక్తి స్టాళ్ల ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రం గా మార్చేందుకు ముందుకు రావాలని సూచించారు.
నషా ముక్త్ భారత్ విజయవంతానికి కృషి చేయాలన్నారు. రామాయంపేట-సిద్దిపేట మధ్యలో ఎన్‌హెచ్-765డీ వెంట 35 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట జీడిమామిడి మొక్కలు పెంచడాన్ని అభినందించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేశ్, ఎస్పీ డీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.