ఆహారం విషయంలో మీరు ఏం తింటున్నారనే దానిలాగే, ఎప్పుడు తింటున్నారనేది కూడా అతి ముఖ్యమైన అంశం. మీ శరీర సహజ స్పందనలకు అనుగుణంగా మీ తిండివేళలు అనుసంధానమై ఉంటాయి. దీన్ని క్రోనోన్యూట్రిషన్ అని పిలుస్తారు. దీన్ని గమనింపులో ఉంచుకుంటే ఆహారం ద్వారా దక్కే ప్రయోజనాలను గరిష్ఠం చేసుకోవచ్చని పోషకాహార నిపుణుల మాట. వివిధ షిఫ్టుల్లో పనులు, యాప్స్ ద్వారా ఎప్పుడంటే అప్పుడే ఆహారం లభ్యం కావడం వల్ల నిర్ణీత వేళల్లో తినే విధానం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో క్రోనోన్యూట్రిషన్ గురించి తెలుసుకోవడం తప్పనిసరి.
నాణ్యమైన పోషకాహారం తీసుకోవడం మాత్రమే సరిపోదు.. దాన్ని సరైన వేళలో తీసుకోవాలనేది క్రోనోన్యూట్రిషన్ ప్రాథమిక సూత్రం. ఇలా చేస్తేనే మీ శరీర జీవక్రియలు, బరువు నిర్వహణ, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, నిద్ర అన్నీ సవ్యంగా సాగిపోతాయి.