Plum Fruits | సంక్రాంతి వచ్చిందంటే రేగు పండ్లు మార్కెట్‌ను ముంచెత్తుతుంటాయి. చిన్నపిల్లలకు భోగి వేయడంతో పాటు వీటితో స్నానం చేయించడం మన ఇళ్లలో చూస్తుంటాం. ఈకాలం పిల్లలకు రేగు పండ్లతో అంతగా అనుబంధం లేదనే చెప్పాలి. చలికాలం చివర్లో లభించే రేగు పండ్లు.. కొంచెం ఒగరు, మరికొంచెం తీపి, ఇంకొంచెం పులుపుతో ఎన్నో పోషకాలు అందిస్తాయి. రేగు పండ్లలో విటమిన్ ఏ, సీ, బీ1, బీ2, బీ3, బీ9 తో పాటు పొటాషియం, జింక్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, సోడియం వంటివి పెద్ద మొత్తంలో ఉండి మనకు రోగనిరోధక శక్తిని అందిస్తాయి.
రేగు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడతాయి. వీటిని తినడం వల్ల కాలేయం పనితీరు కూడా మెరుగవుతుంది.
రేగు పండ్లలో ఫైటోకెమికల్స్, వివిధ రకాల పోషకాలు ఉంటాయి. చలి రోజుల్లో రేగు పండ్లను తినడం ద్వారా జీర్ణక్రియకు బాధ్యత వహించే ఎంజైమ్‌లు సరిగ్గా పనిచేస్తాయి. మలబద్దకాన్ని దూరం చేసే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఎముకలను బలంగా చేయడం సాయపడతాయి.
మెగ్నీషియం అధికంగా ఉండి యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. రేగు పండ్లను ఈ సీజన్లో ఎక్కువగా తినడం వల్ల ఆందోళనను కూడా దూరం చేసుకోవచ్చు. వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ మనల్ని ఒత్తిడికి దూరంగా ఉంచుతాయి. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.
రేగు పండ్లలో విటమిన్ సీ నారింజ పండ్లలో కంటే ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల రేగు పండులో 69 మి.గ్రా విటమిన్ సీ లభిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మెరుపునిస్తాయి. ముఖం మీద మొటిమలు, కళ్ల కింద నల్లగా చారలను తొలగించుకునేందుకు గొప్పగా ఉపయోగపడతాయి.
రోజుకు 8-10 రేగు పండ్లను తినడం ద్వారా డాండ్రఫ్‌ను దూరం చేసుకోవచ్చునని, జుట్టును మందంగా తయారయ్యేలా చేసుకోవచ్చునని నిపుణులు సెలవిస్తున్నారు. చలికాలంలో ఎక్కువగా జబ్బులకు గురయ్యే పిల్లలకు ఈ పండ్లను తినిపించడం ద్వారా ఆరోగ్యవంతులుగా చేయవచ్చు.