హైదరాబాద్, ఆగస్టు 27: హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏఎస్బీఎల్ మరో అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు సమీపంలో ఏఎస్బీఎల్ లెగసీ పేరుతో 7.97 ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టును 51 ఫ్లోర్లతో మూడు టవర్లను నిర్మిస్తున్నట్టు ఏఎస్బీఎల్ సీఈవో, ఫౌండర్ అజితేష్ కోరుపోలు తెలిపారు. ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టునకు రెరా అనుమతులు కూడా లభించాయని, వచ్చే నెల చివరి నుంచి బుకింగ్లు ప్రారంభించబోతున్న ఈ ప్రాజెక్టు జూన్ 2031 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.400 కోట్లు ఖర్చు చేసినట్టు, వచ్చే ఐదేండ్లకాలంలో మరో రూ.1,800 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. మూడు, నాలుగు బీహెచ్కే కలిగిన ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో రూ.1.99 కోట్ల ప్రారంభ ధరను నిర్ణయించింది. 2025-26లో రూ.1,850 కోట్ల విక్రయాలు జరిపిన సంస్థ..ఈ ఏడాది రూ.2,500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. సంస్థ ఇప్పటి వరకు నాలుగు అతిపెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయగా, మరో మూడు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వచ్చే మూడేండ్ల తర్వాతనే ఐపీవోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు.