Early Pregnancy Symptoms | గర్భం దాల్చడం అన్నది మహిళలకు మాత్రమే లభించిన ఒక గొప్ప వరం. ఈ క్రమంలోనే సంతానం లేని ఎందరో మహిళలు సంతానం పొందేందుకు ఆరాట పడుతుంటారు. ప్రస్తుతం చాలా మంది ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు, దీనికి తోడు హార్మోన్ల సమస్యలు వస్తున్నాయి. కనుక చాలా మంది మహిళలు సంతానం పొందలేకపోతున్నారు. అయితే గర్భం దాల్చిన మహిళలకు మాత్రం మొదటి సారి అయితే లక్షణాలు సరిగ్గా తెలియవు. తాము గర్భం ధరించామని కూడా గుర్తించలేరు. కానీ శరీరం తెలియజేసే కొన్ని సంకేతాలు, లక్షణాలను పరిశీలిస్తే మహిళలకు తాము గర్భం దాల్చారో లేదో అన్న విషయం సులభంగా ఇట్టే తెలిసిపోతుంది. ఆ సమయంలో మహిళల్లో కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తాయి.
గర్భం దాల్చిన మహిళల్లో చాలా వరకు మొదటి రెండు వారాల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ కొందరికి మాత్రం పలు లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శుక్రకణంతో ఫలదీకరణం చెందిన అండం గర్భాశయ గోడకు చేరుతుంది. ఆ సమయంలో కాస్త రక్త స్రావం అవుతుంది. పీరియడ్స్ వచ్చాక లేదా రావడానికి కొన్ని రోజుల ముందు ఇలా జరుగుతుంది. దీన్ని చూసి చాలా మంది మహిళలు నెలసరి సరిగ్గా రావడం లేదని భావిస్తారు. కానీ గర్భం దాల్చారు అన్న విషయాన్ని గుర్తించలేరు. గర్భం దాల్చిన మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల లాంటి నొప్పులు వస్తాయి. దీంతో ఆ నొప్పులను పోల్చులేకపోతారు. ఇలా కూడా వారికి ఆ విషయం తెలియదు.
ఉన్నట్లుండి సడెన్‌గా నీరసం వస్తున్నా, తీవ్రమైన అలసటగా ఉన్నా, విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తున్నా అది గర్భం వచ్చిందన్న విషయాన్ని తెలియజేస్తుంది. అయితే కొందరు మహిళలకు హార్మోన్లలో వచ్చే హెచ్చు తగ్గుల కారణంగా కూడా ఇలా జరుగుతుంది. కనుక ఈ సమస్య ఉంటే డాక్టర్‌ను సంప్రదిస్తే పరీక్ష చేసి సరైన సమస్య నిర్దారిస్తారు. దీంతో అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవచ్చు. అలాగే గర్భం దాల్చిన మహిళల్లో కొందరికి స్తనాలు మృదువుగా మారి కాస్త వాపులకు గురైనట్లు అవుతాయి. ముట్టుకుంటే భారంగా అనిపిస్తాయి. కొందరికి ఆ భాగాల్లో సూదులతో గుచ్చినట్లు కూడా అనిపిస్తుంది. నిపుల్స్ ముదురు గోధుమ రంగులోకి మారుతాయి.
గర్భం దాల్చిన మహిళలకు పీరియడ్స్ రావు. మహిళలు తమ పీరియడ్‌ను మిస్ అయితే గర్భం దాల్చారేమో చెక్ చేసుకోవాలి. ఇందుకు అవసరం అయితే టెస్టింగ్ కిట్‌ను వాడవచ్చు. కొన్ని సార్లు ఈ కిట్స్ ద్వారా సరైన ఫలితాలు రావు. కనుక డాక్టర్‌ను కలిసి పరీక్ష చేయించుకుంటే మంచిది. అలాగే మూత్ర విసర్జన తరచూ చేయాల్సి రావడం, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, ఆహారం బాగా తినాలని అనిపించడం, మూడ్ మారుతుండడం, తలనొప్పి, మలబద్దకం, కడుపు ఉబ్బరం, శరీర ఉష్ణోగ్రతలో తీవ్రమైన హెచ్చు తగ్గులు వెంట వెంటనే రావడం, వాసన చూసే శక్తి పెరగడం, నోట్లో లోహపు రుచి అనిపించడం.. ఇవన్నీ గర్భం దాల్చారని తెలియజేసే సంకేతాలు. అయితే ఇవి అందరిలోనూ కనిపించాలని నియమం ఏమీ లేదు. కనుక ఈ సూచనలు కనిపిస్తే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవడం మంచిది.