Lemon Tea | రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఉదయం నిద్ర లేచాక బెడ్ టీ లేదా కాఫీ తాగకపోతే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. టీ, కాఫీ అనేవి మన దినచర్యలో భాగం అయిపోయాయి. అంతెందుకు.. ఇంట్లో ఇవి లభించకపోతే ఎంచక్కా బయటకు వెళ్లి వీటిని తాగేవారు కూడా ఉన్నారు. అయితే టీ, కాఫీలలో ఉండే కెఫీన్ మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. కనుక వీటిని అతిగా తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ లెమన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మీకు టీ తాగాలని అనిపించినప్పుడల్లా లెమన్ టీని సేవించాలని వారు సూచిస్తున్నారు. లెమన్ టీలో పుదీనా, తేనె కలుస్తాయి. అందువల్ల ఈ టీ ఎంతో ఆరోగ్యకరమైందని, లెమన్ టీని రోజూ సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు. లెమన్ టీ తాగితే అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడి బారిన పడుతున్నారు. ఆఫీసుల్లో పనిచేసే వారికి అయితే ఒత్తిడి మరీ అధికంగా ఉంటోంది. అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు గాను లెమన్ టీ ఎంతగానో సహాయ పడుతుంది. లెమన్ టీలో ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, కాపర్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజ పరుస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. రోజూ లెమన్ టీ ని సేవించడం వల్ల ఒత్తిడి మటుమాయం అవుతుంది. డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే రాత్రి పూట మైండ్ ప్రశాంతంగా మారి నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.
డయాబెటిస్తో బాధపడుతున్న వారికి లెమన్ టీ వరం అనే చెప్పవచ్చు. లెమన్ టీని సేవించడం వల్ల హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు లెమన్ టీని సేవిస్తుంటే మేలు జరుగుతుంది. లెమన్ టీలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఉదయం లెమన్ టీని బ్రేక్ ఫాస్ట్ అనంతరం సేవించాలి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. లెమన్‌లో అధికంగా ఉండే సిట్రిక్ యాసిడ్ లివర్‌లోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీంతో లివర్ క్లీన్ అవుతుంది. లెమన్ టీని ఉదయం పరగడుపున కూడా సేవించవచ్చు. దీంతో శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
తలనొప్పి తీవ్రంగా మారితే దాన్ని మైగ్రేన్ అంటారన్న సంగతి తెలిసిందే. అయితే లెమన్ టీ తాగితే మైగ్రేన్ నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. లెమన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో శరీరానికి శక్తి లభించడమే కాక మెదడు ఉత్తేజం చెందుతుంది. ఫలితంగా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక మైగ్రేన్ ఉన్నవారు లెమన్ టీని సేవిస్తుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ టీని తాగడం వల్ల దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. సీజన్లు మారినప్పుడు మనల్ని ఇవి ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. కానీ లెమన్ టీని సేవిస్తుంటే ఈ సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. ఇలా లెమన్ టీ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. సాధారణ టీ, కాఫీ లకు బదులుగా లెమన్ టీని తాగితే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.