Cumin Water | జీలకర్ర మనందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని ఎంతో కాలంగా వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. జీలకర్రను రోజూ మనం వంటల్లో వేస్తుంటాం. ఇది చక్కని సువాసనను కలిగి ఉంటుంది. జీలకర్రను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీన్ని నేరుగా తినలేరు. కానీ జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను ఉదయం పరగడుపునే తాగవచ్చు. రోజూ ఉదయం పరగడుపునే జీలకర్ర నీళ్లను ఒక కప్పు మోతాదులో తాగాల్సి ఉంటుంది. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. జీలకర్రలో కుమినాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. పరగడుపునే జీలకర్ర నీళ్లను తాగడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
జీలకర్ర నీళ్లను సేవిస్తుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు జీలకర్ర నీళ్లను తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఈ నీళ్లను తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. జీలకర్ర నీళ్లను సేవించడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. జీలకర్ర నీళ్లను తాగుతుంటే లివర్, కిడ్నీలు సైతం శుభ్రంగా ఉంటాయి. ఆయా భాగాల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
జీలకర్రలో ఐరన్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. శరీరం వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. జీలకర్రలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా మొటిమలను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. దీంతో ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. జీలకర్ర నీళ్లను రోజూ తాగుతుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం.. ఈ నీళ్లను తాగితే శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
జీలకర్ర నీళ్లు బీపీని తగ్గించడంలో సహాయం చేస్తాయి. కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. దీని వల్ల రక్త నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. ఇక జీలకర్ర నీళ్లను మరీ అతిగా తాగకూడదు. ఒక కప్పు మోతాదులోనే సేవించాలి. లేదంటే కడుపులో మంట వచ్చే అవకాశం ఉంటుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా ఈ నీళ్లను తాగకూడదు.