Chamomile Tea | ఆరోగ్యంగా ఉండేందుకు హెర్బల్ టీలు ఎంతగానో దోహదం చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే చాలా మంది రకరకాల హెర్బల్ టీలను రోజూ తాగుతుంటారు. ఇక హెర్బల్ టీలలో కమోమిల్ (Chamomile) టీ కూడా ఒకటి. కమోమిల్ అనే మొక్క పువ్వుల నుంచి ఈ టీని తయారు చేస్తారు. ఈ టీ పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. చూసేందుకు ఈ పువ్వులు అచ్చం గడ్డి చామంతి పువ్వులను పోలి ఉంటాయి. కానీ అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కమోమిల్ టీని మనం రాత్రి పూట తాగాల్సి ఉంటుంది. భోజనం చేసిన అనంతరం ఈ టీని సేవించాలి. కమోమిల్ టీని రోజూ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని వారు అంటున్నారు.
కమోమిల్ టీలో ఎపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మెదడును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. నిద్రను ప్రోత్సహిస్తుంది. కనుకనే ఈ టీని రాత్రి పూట సేవించాల్సి ఉంటుంది. భోజనం చేసిన అనంతరం ఈ టీని తాగవచ్చు. లేదా నిద్రకు ముందు కూడా తాగవచ్చు. కమోమిల్ టీని రోజూ తాగడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితంతో సతమతం అయ్యే వారు ఈ టీని రోజూ తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
కమోమిల్ టీని సేవించడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈ టీలో యాంటీ స్పాస్మోడిక్, కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల జీర్ణాశయ కండరాలు ప్రశాంతంగా మారుతాయి. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆహారం అతిగా తీసుకున్న వారు ఈ టీని తాగితే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. పొట్ట నిండుగా ఉన్న భావన తగ్గుతుంది. అలాగే కడుపు నొప్పి, వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు సైతం తగ్గిపోతాయి. కమోమిల్ టీని సేవించడం వల్ల రోజువారిగా వివిధ సందర్భాల్లో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనను సులభంగా అధిగమించవచ్చు. కమోమిల్ టీలో సెడేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీంతో ఆందోళన, కంగారు వంటి సమస్యలు తగ్గిపోతాయి.
కమోమిల్ టీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తాయి. కమోమిల్ టీని సేవించడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి తగ్గిపోతుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కమోమిల్ టీని రోజూ సేవించడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయని తేలింది. అందువల్ల ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ టీలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి క్లోమగ్రంథి కణాలు వాపులకు గురి కాకుండా రక్షిస్తాయి. దీని వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక డయాబెటిస్ ఉన్న వారు ఈ టీని తాగుతుంటే ఫలితం ఉంటుంది. ఇలా కమోమిల్ టీ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.