Doosari Theega | ఆయుర్వేద ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల్లో వచ్చే హెచ్చు తగ్గుల కారణంగానే మనకు రోగాలు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే ఆ దోషాలను సమతుల్యం చేసేలా ఔషధాలను తయారు చేస్తుంటారు. వాటిని రోగాన్ని బట్టి, రోగి పరిస్థితిని బట్టి ఇస్తుంటారు. దీంతో ఆ దోషాలు సమతుల్యం అవుతాయి. రోగం నయం అవుతుంది. ఆయుర్వేద ఔషధాలు ఇదే సూత్రంపై ఆధార పడి పనిచేస్తాయి. అయితే అన్ని రకాల ఔషధాలు ఏదో ఒకటి లేదా రెండు దోషాలను మాత్రమే సమతుల్యం చేయగలవు. కేవలం కొన్ని మాత్రమే మూడు దోషాలను సమతుల్యం చేస్తాయి. అలాంటి ఔషధాల్లో దూసరి తీగ కూడా ఒకటి. దీన్నే పాతాళ గరుడి అని కూడా పిలుస్తారు. దూసరి తీగ ఆకుల రసాన్ని అనేక వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది వాత, పిత్త, కఫ మూడు దోషాలను సమతుల్యం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
దూసరి తీగ మన చుట్టూ ప్రకృతిలోనే పెరుగుతుంది. దీన్ని చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ మొక్కలో ఔషధ గుణాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో మనకు దూసరి తీగ విరివిగా లభిస్తుంది. ఎక్కడ చూసినా ఈ మొక్క మనకు దర్శనమిస్తుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని ఉపయోగిస్తే పలు వ్యాధులు నయం అవుతాయి. దూసరి ఆకులతోపాటు వేర్లను కూడా ఉపయోగించవచ్చు. దేన్ని ఉపయోగించినా సరే నీటితో కలిపి 10 నుంచి 20 ఎంఎల్ మోతాదులో మాత్రమే వాడుకోవాలి. దూసరి తీగ నుంచి రసం తీసి 10 నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టాలి. తరువాత అందులో కాస్త పటిక బెల్లం కలిపి తీసుకోవాలి. దీంతో శరీరంలోని వేడి తగ్గిపోతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. డీహైడ్రేషన్ తగ్గుతుంది. మూత్రంలో మంట తగ్గి మూత్రం ధారాళంగా వస్తుంది. వేసవిలో ఈ మిశ్రమాన్ని తీసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది.
దూసరి తీగ ఆకుల రసం, పటిక బెల్లం కలిపి తీసుకోవడం వల్ల మహిళల్లో గర్భాశయ సమస్యలు సైతం తొలగిపోతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. మహిళల్లో వచ్చే హార్మోన్ సమస్యలు కూడా తగ్గుతాయి. నెలసరి సక్రమంగా వస్తుంది. దూసరి తీగ ఆకుల రసాన్ని కాస్త తీసుకుని స్నానం చేసే నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేస్తే వేసవిలో వచ్చే వేడి కురుపులు, చెమట కాయలు తగ్గుతాయి. వేసవిలో కొందరికి చెమట కారణంగా చర్మంపై దురద వస్తుంది. ఈ సమస్య నుంచి కూడా బయట పడవచ్చు. దూసరి తీగ ఆకులు అన్ని వేళలా లభించవు అనుకునే వారు ఈ ఆకులతో పొడి తయారు చేసుకుని దాన్ని సీసాలో నిల్వ చేసి కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు.
దూసరి తీగ ఆకుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు దూసరి తీగ ఆకుల రసాన్ని సేవిస్తుంటే త్వరగా ఎముకలు అతుక్కుంటాయి. ఉదయం నిద్ర లేవగానే కొందరికి నీరసంగా ఉంటుంది. ఎలాంటి పని చేయకపోయినా, రాత్రంతా సరిగ్గానే నిద్రించినా ఉదయం అలసటగా అనిపిస్తుంది. అలాంటి వారు ఉత్తేజం కోసం ఉదయం దూసరి తీగ రసాన్ని తీసుకోవచ్చు. దీంతో యాక్టివ్గా మారి చురుగ్గా పనిచేస్తారు. దూసరి తీగ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకు ఆరోగ్యపరమైన లాభాలే కాకుండా ఇంకో లాభం కూడా ఉంది. అదేమిటంటే.. పూర్వం మన పెద్దలు దూసరి తీగను ఇళ్లలో ఎక్కువగా పెంచుకునేవారు. దీంతో పాములు, తేళ్ల వంటి విష కీటకాలు ఇళ్లలోకి రావని నమ్మేవారు. ఇలా దూసరి తీగ మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.