Monsoon | నమస్తే జిందగీ. వానకాలంలో ఆకుకూరలు తినకూడదని చెబుతారు కదా! ఇది ఎంతవరకు నిజం? ఈ కాలంలో ఆకుకూరలకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెబుతారా?!
-ఓ పాఠకురాలు
సాధారణంగా ఆకుకూరలు తక్కువ ఎత్తులో పండుతాయి. అంటే ఆ మొక్కల ఆకులు భూమికి దగ్గరగా ఉంటాయి. దానివల్ల వర్షం పడ్డప్పుడు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చిన నీళ్లు వాటిని తాకడం లేదా అతి సమీపంలోకి రావడం వల్ల అవి కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ నీళ్లలోని సూక్ష్మజీవులు, హానికారకాలు వీటి మీద చేరే ప్రమాదమూ ఉంది. మరో విషయం ఈ తడి వాతావరణం వల్ల మామూలుగా కూడా సూక్ష్మక్రిములు ఎక్కువగా పెరుగుతాయి. ఆకుల మీద పురుగూ పుట్రా చేరతాయి. అందువల్ల ఈ సీజన్లో ఆకుకూరలు తినకూడదని కొందరు చెబుతారు. మరో విషయం, వానకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం కారణంగా మన శరీరం డెంగీ, మలేరియా… ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. అలాంటప్పుడు ఆకుకూరల్లో ఏమన్నా తేడా ఉంటే మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
అందులోనూ ఆకుకూరల్లో పీచు ఎక్కువ కాబట్టి జీర్ణమయ్యేందుకూ కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఆకుకూరల వినియోగం ఎప్పటికన్నా కాస్త తగ్గించుకుంటే మంచిదే. అయితే ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలను చక్కగా తీసుకోవచ్చు. బయటివి అయితే వారానికి మూడు నాలుగు సార్లు తీసుకునే వాళ్లు ఒకసారి తీసుకోవచ్చు. వీటికి ప్రత్యామ్నాయంగా క్యారట్, వంకాయలాంటి నిండు రంగు కూరగాయలు, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, కాకరకాయ లాంటి ఎత్తులో పెరిగే కాయగూరలూ తినొచ్చు. ఆకుకూరలనే కాదు కాలీఫ్లవర్, క్యాబేజిలాంటివాటిలో కూడా ఈ కాలంలో పురుగులు వస్తాయి. కాబట్టి చూసుకొని తినాలి. అలాగే ఆకుకూరలను వండేటప్పుడు ఉప్పు నీళ్లలో ఐదు నిమిషాలు ఉంచి, నల్లా నీటిలో శుభ్రంగా కడగాలి. తరిగిన వెంటనే వండాలి.
-మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com