Vitamin P | మన ఆరోగ్యం కోసం పోషకాలు ఉండే ఆహారాలను తినాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. పోషకాల విషయానికి వస్తే వాటిల్లో స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని రెండు రకాలు ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లను స్థూల పోషకాలు అని పిలుస్తారు. ఇవి మన శరీరానికి పెద్ద మొత్తంలో అవసరం అవుతాయి. కనుక వీటిని రోజూ అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే విటమిన్లు, మినరల్స్, ఇతర సమ్మేళనాలను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి మనకు చాలా స్వల్ప మోతాదులో అవసరం అవుతాయి. కనుక రోజూ తీసుకోకపోయినా సూక్ష్మ పోషకాలు ఉండే ఆహారాలను తరచూ తినాల్సి ఉంటుంది. లేదంటే పోషకాహార లోపం ఏర్పడుతుంది. అయితే సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే వాటిల్లో మనకు ఈ మధ్య కాలంలో విటమిన్ పి అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే విటమిన్ పి నిజంగానే ఉందా..? ఉంటే దాన్ని ఎలా పొందాలి..? దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ పి అన్న పోషక పదార్థం వాస్తవానికి ఎక్కడా లేదు. అసలు పి విటమిన్ అన్నదే లేదు. శాస్త్రీయంగా పి విటమిన్ ఉన్నట్లు ఎక్కడా నిరూపణ కాలేదు. మరి పి విటమిన్ అనే పదాన్ని ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు..? అంటే.. 1930లలో నారింజ పండ్ల నుంచి తీసిన ఒక సమ్మేళనాన్ని విటమిన్ పిగా పేర్కొన్నారు. ఇది విటమిన్ సి ని పోలి ఉంటుంది. రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. దానికి సూచనగా permeability అనే పదాన్ని వాడి ఆ సమ్మేళనానికి విటమిన్ పి అని పేరుపెట్టారు. కానీ తరువాతి కాలంలో ఆ సమ్మేళనాన్ని విటమిన్ల జాబితా నుంచి తొలగించారు. విటమిన్ అన్న పోషకానికి ఆ సమ్మేళనం సరిపోలలేదు. అందుకని ఆ సమ్మేళనాన్ని పి విటమిన్ అని పిలవడం మానేశారు. అయితే సైంటిస్టులు పి విటమిన్ అన్న దానికి మాత్రం మరో నిర్వచనం ఇచ్చారు. ఫ్లేవనాయిడ్స్, బయో ఫ్లేవనాయిడ్స్ వంటి సుమారు 6వేల రకాలకు పైగా ఫ్లేవనాయిడ్స్ను ఒక గ్రూప్ గా చేర్చి దాన్ని పి విటమిన్గా వ్యవహరించడం మొదలు పెట్టారు. అలా పి విటమిన్ మళ్లీ వాడుకలోకి వచ్చింది. కానీ వాస్తవంగా ఇది విటమిన్ల జాబితాకు మాత్రం చెందదు. అయినప్పటికీ దీన్ని ఒక ప్రత్యేకమైన పోషక పదార్థంగా పేర్కొని దీంతో లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.
విటమిన్ పిగా చెబుతున్న సమ్మేళనాలు ఫ్లేవనాయిడ్స్ జాబితాకు చెందుతాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగానే కాక యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలుగా కూడా పనిచేస్తాయి. ఫ్లేవనాయిడ్స్ వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ తొలగించబడతాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఫ్లేవనాయిడ్స్ వల్ల మనం తినే ఆహారాల్లో ఉండే విటమిన్ సి ని శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఫ్లేవనాయిడ్స్ వల్ల శరీరంలో ఉండే వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఫ్లేవనాయిడ్స్ బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్లేవనాయిడ్స్ వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఫ్లేవనాయిడ్స్ వల్ల మెదడు పనితీరు మెరుగు పడి యాక్టివ్గా మారుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. ఇక విటమిన్ పి (ఫ్లేవనాయిడ్స్) మనకు సిట్రస్ ఫలాల్లో అధికంగా లభిస్తుంది. నారింజ, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్ వంటి పండ్లతోపాటు బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, బ్లాక్ బెర్రీలలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. అలాగే డార్క్ చాకొలెట్, బ్లాక్ టీ, గ్రీన్ టీ, యాపిల్స్, ఆకుకూరలు, ఉల్లిపాయలు, ద్రాక్ష వంటి ఆహారాలను తినడం వల్ల వీటిని అధికంగా పొందవచ్చు.