Vegetarian Foods | శాకాహార ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం ఇప్పటికే అనేక అధ్యయనాలు సూచించాయి. తాజాగా నిర్వహించిన ఒక విస్తృత స్థాయి పరిశోధనలో శాకాహార ఆహారం కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూకే, అమెరికా, భారత్, తైవాన్ దేశాలకు చెందిన దాదాపు 18 లక్షల మంది డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం, మాంసాహారం, క్యాన్సర్ మధ్య సంబంధంపై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పరిశోధనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ అధ్యయనంలో సాధారణ మాంసాహారులు, కోడి మాంసం మాత్రమే తినేవారు, చేపలు తినేవారు, శాకాహారులు, పూర్తిగా వేగన్ ఆహారం తీసుకునేవారిని ఐదు వర్గాలుగా విభజించి పరిశీలించారు. ఫలితాల్లో శాకాహారులు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, మల్టిపుల్ మైలోమా వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తక్కువగా ఎదుర్కొన్నట్లు గుర్తించారు. అయితే ఒక రకమైన ఈసోఫేజియల్ క్యాన్సర్ ప్రమాదం మాత్రం శాకాహారుల్లో ఎక్కువగా కనిపించిందని అధ్యయనం వెల్లడించింది.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ లో ప్రచురితమైన ఈ పరిశోధనను ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ కు చెందిన క్యాన్సర్ ఎపిడెమియాలజీ యూనిట్ నిర్వహించింది. ప్రపంచ క్యాన్సర్ పరిశోధన నిధి సహకారంతో సాగిన ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిని సగటున 16 సంవత్సరాల పాటు పరిశీలించారు. శరీర బరువు (BMI) వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆహారం ప్రభావాన్ని ప్రత్యేకంగా విశ్లేషించారు. అధ్యయనం ప్రకారం, శాకాహారుల్లో కొన్ని క్యాన్సర్ల ప్రమాదం 31 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదం 21 శాతం, బ్రెస్ట్ క్యాన్సర్ 9 శాతం, ప్రోస్టేట్ క్యాన్సర్ 12 శాతం, కిడ్నీ క్యాన్సర్ 28 శాతం, మల్టిపుల్ మైలోమా 31 శాతం వరకు తగ్గినట్లు వెల్లడించారు. చేపలు తినేవారిలో, కోడి మాంసం మాత్రమే తీసుకునేవారిలో కూడా కొంతమేర ప్రయోజనాలు కనిపించాయి. ముఖ్యంగా కొలొరెక్టల్, ప్రోస్టేట్ క్యాన్సర్ల ప్రమాదం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, పప్పుధాన్యాలు అధికంగా ఉండే శాకాహార ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, తక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఎర్ర మాంసం, ప్రాసెస్డ్ మాంసం తగ్గించడం వల్ల ట్యూమర్ల పెరుగుదలకు కారణమయ్యే కొన్ని రసాయనాల ప్రభావం తగ్గుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే శాకాహారం తీసుకునేవారిలో ఒక రకమైన ఈసోఫేజియల్ క్యాన్సర్ ప్రమాదం పెరగడం ఆందోళన కలిగించే అంశంగా అధ్యయనం పేర్కొంది. విటమిన్ బి12 వంటి కొన్ని పోషకాల లోపం దీనికి కారణం కావచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. పూర్తిగా వేగన్ ఆహారం తీసుకునేవారిలో కాల్షియం తక్కువగా ఉండటం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని కూడా సూచించారు.
భారత్లో 20 నుంచి 40 శాతం మంది వరకు శాకాహారం తీసుకునే నేపథ్యంలో ఈ అధ్యయనం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణీకరణతోపాటు బ్రెస్ట్, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్ల కేసులు పెరుగుతున్న సమయంలో, సంప్రదాయ భారతీయ శాకాహార ఆహారం క్యాన్సర్ నివారణలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే కేవలం కార్బొహైడ్రేట్లు, వేయించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు పెరిగి క్యాన్సర్ ప్రమాదం అధికమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమతుల్య ఆహారం తీసుకోవడం, ఫైబర్ అధికంగా ఉన్న కూరగాయలు ఎక్కువగా తినడం, అవసరమైతే విటమిన్ బి12 స్థాయిలను పరీక్షించుకోవడం అవసరమని సూచిస్తున్నారు.